Dhanush : మళ్లీ తెలుగు బాట పట్టిన ధనుష్.. హిట్ ఇచ్చిన వెంకీ అట్లూరితో మరో మూవీ!
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ స్టార్ హీరో ధనుష్‌కు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటు బలమైన మార్కెట్ ఉంది. ఆయన నటించిన సినిమాలు దాదాపు అన్నీ తెలుగులో డబ్బింగ్ అయి విడుదలవుతుంటాయి. ప్రస్తుతం ధనుష్ 'కర' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగులో ఉన్న క్రేజ్ దృష్ట్యా ధనుష్ ఇప్పటికే డైరెక్ట్ తెలుగు సినిమాలుగా 'సర్', 'కుబేర' చిత్రాల్లో నటించారు. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు మరోసారి స్ట్రైట్ తెలుగు ప్రాజెక్ట్‌కు ఆయన సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా 'కర' ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో నిన్న రాత్రి ఘనంగా జరిగింది.
వివరాలు
త్వరలోనే అధికారిక ప్రకటన
ఈ కార్యక్రమానికి 'సర్' దర్శకుడు వెంకీ అట్లూరి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ధనుష్ మాట్లాడుతూ.. "వెంకీ, నువ్వు నాకు ఒక కథ చెప్పావు.. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. అదే కథను తీసుకురా, మనం ఆ ప్రాజెక్ట్ చేద్దాం. నేను వెయిట్ చేస్తున్నాను" అని వ్యాఖ్యానించారు. దీంతో ఈ మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 'సర్'తో తనకు హిట్ ఇచ్చిన వెంకీ అట్లూరితో ధనుష్ మరో సినిమా చేయడం దాదాపు ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. కాగా వెంకీ అట్లూరి ప్రస్తుతం సూర్యతో 'విశ్వనాథ్ & సన్స్' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.