Asaduddin Owaisi: ధురంధర్ పెద్ద చెత్త సినిమా.. అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా 'ధురంధర్-2' సినిమా దూసుకుపోతోంది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధిస్తూ రికార్డులు సృష్టిస్తోంది. ఒకవైపు ఈ సినిమాపై ప్రశంసలు వెల్లువెత్తుతుండగా.. మరోవైపు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విమర్శకుల జాబితాలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా చేరారు. టైమ్స్ నౌ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఓవైసీ.. 'ధురంధర్-2'ను తీవ్రంగా విమర్శించారు. ఈ సినిమాను "బక్వాస్" (చెత్త సినిమా)గా అభివర్ణిస్తూ.. హింసను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. "అది అసలు సినిమానా?" అంటూ ప్రశ్నించిన ఆయన.. మూడు గంటల పాటు అర్థంలేని గారడీలా ఉందని కొట్టిపారేశారు.
వివరాలు
ఇలాంటి సినిమాలను పట్టించుకోకూడదు
ఆదిత్య ధర్ నిర్మాణంలో, రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధిస్తున్న సమయంలో ఓవైసీ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తాను ఈ సినిమా పూర్తిగా చూడలేదని, మూడు గంటలు వెచ్చించేందుకు సమయం లేదని పేర్కొన్నారు. సినిమా ఎలాంటి సందేశం ఇస్తుందో అర్థం కావడం లేదని, ముఖ్యంగా ముస్లింలపై అనుమానాలు రేకెత్తించేలా చిత్రీకరించారని విమర్శించారు. ఇలాంటి సినిమాలను పట్టించుకోవడం కంటే నిర్లక్ష్యం చేయడమే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన 'ధురంధర్-2' పాకిస్తాన్ నేపథ్యంతో సాగుతుంది. కరాచీలోని నేర సామ్రాజ్యంలోకి ఓ భారతీయ ఏజెంట్ ప్రవేశించి, అక్కడి మాఫియాను ఎదుర్కొనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.
వివరాలు
ప్రపంచ వ్యాప్తంగా రూ.1300 కోట్ల వసూలు
ఇందులో IC-814 హైజాకింగ్, భారత పార్లమెంట్‌పై దాడి, ముంబై ఉగ్రదాడులు వంటి వాస్తవ ఘటనలను కూడా చేర్చారు. జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 19న విడుదలైంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే దేశీయంగా రూ. 715.72 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 1,128 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం. గత ఏడాది డిసెంబర్‌లో వచ్చిన తొలి భాగం 'ధురంధర్' దేశీయంగా రూ. 840 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 1,300 కోట్లకు పైగా వసూలు చేసి, ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు పెంచింది.