Loading...
Dilraju: 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌' కాపీరైట్‌ కేసు.. దిల్‌రాజుకు సుప్రీంకోర్టులో ఊరట
'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌' కాపీరైట్‌ కేసు.. దిల్‌రాజుకు సుప్రీంకోర్టులో ఊరట

Dilraju: 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌' కాపీరైట్‌ కేసు.. దిల్‌రాజుకు సుప్రీంకోర్టులో ఊరట

వ్రాసిన వారు Moogati Shabari
Aug 13, 2026
10:44 am

ఈ వార్తాకథనం ఏంటి

'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌' సినిమా కాపీరైట్‌ వివాదంలో సినీ నిర్మాత దిల్‌రాజుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో హైదరాబాద్‌ ట్రయల్‌ కోర్టులో కొనసాగుతున్న విచారణపై గత ఏడాది ఫిబ్రవరిలో విధించిన స్టేను ఎత్తివేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మల్య బాగ్చి, జస్టిస్‌ వి.మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 ఆగస్టులో సాహితీ పబ్లిషర్స్‌ ప్రచురించిన 'నా మనసు కోరింది నిన్నే' నవలను కాపీ చేసి 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌' సినిమా తీశారంటూ రచయిత్రి ముమ్మిడి శ్యామలరాణి 2017 జులై 12న దిల్‌రాజుపై ఫిర్యాదు చేశారు.

వివరాలు

కాపీరైట్‌ చట్టంలోని సెక్షన్‌ 63 కింద విచారణ..

ఈ ఫిర్యాదుపై ట్రయల్‌ కోర్టు మేజిస్ట్రేట్‌ 2018 అక్టోబరు 27న ఐపీసీ సెక్షన్‌ 420, కాపీరైట్‌ చట్టంలోని సెక్షన్‌ 63 కింద నోటీసులు జారీ చేశారు.

వాటిని సవాల్‌ చేస్తూ దిల్‌రాజు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయనపై ఐపీసీ సెక్షన్‌ 420 కింద నమోదైన ఫిర్యాదును హైకోర్టు కొట్టివేసింది.

అయితే కాపీరైట్‌ చట్టంలోని సెక్షన్‌ 63 కింద విచారణను కొనసాగించేందుకు ట్రయల్‌ కోర్టుకు అనుమతిస్తూ హైకోర్టు 2024 డిసెంబరులో ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దిల్‌రాజు 2025 ఫిబ్రవరి 6న సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

అదే నెల 24న ఈ పిటిషన్‌పై జస్టిస్‌ జేబీ పర్దివాలా, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

వివరాలు

ట్రయల్‌ కోర్టులో కొనసాగుతున్న విచారణ..

ఫిర్యాదుపై విచారణకు సీఆర్‌పీసీ సెక్షన్‌ 468 కింద ఉన్న కాలపరిమితికి సంబంధించిన అంశంపై ప్రతివాదుల అభిప్రాయాన్ని కోరుతూ నోటీసులు జారీ చేసింది.

ట్రయల్‌ కోర్టులో కొనసాగుతున్న విచారణపై స్టే విధించింది.

ఏడాదిన్నరగా కొనసాగుతున్న ఈ స్టేను ఎత్తివేయాలని శ్యామలరాణి తరఫు న్యాయవాది బుధవారం సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోరారు.

పిటిషనర్‌ వయసు 71 సంవత్సరాలని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ట్రయల్‌ కోర్టులో విచారణ కొనసాగించేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.

ఇందుకు సీజేఐ నిరాకరించారు. ''ఈ కోర్టు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే స్టే ఇచ్చింది.

అప్పట్లో మీ వాదనలను కూడా విన్నాం. ఆ స్టే ఇచ్చింది కూడా 2025లోనే'' అని సీజేఐ పేర్కొన్నారు. అనంతరం విచారణను ముగించారు.

ADVERTISEMENT