
తెరపైకి దిల్ రాజు, బోయపాటి శ్రీను కాంబినేషన్: తమిళ హీరోతో సినిమా మొదలు?
ఈ వార్తాకథనం ఏంటి
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను స్కంద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
రామ్ పోతినేని, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద అంతగా ప్రభావాన్ని చూపలేకపోయింది.
స్కంద తర్వాత బోయపాటి శ్రీను చేయబోయే సినిమాపై అందరికీ ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం, దిల్ రాజు, బోయపాటి శ్రీను కాంబినేషన్లో సినిమా రాబోతుందని తెలుస్తోంది.
గతంలో దిల్ రాజు నిర్మాతగా బోయపాటి దర్శకత్వంలో భద్ర సినిమా వచ్చింది. రవితేజ హీరోగా రూపొందిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
ఈసారి వీరిద్దరి కాంబినేషన్లో తమిళ హీరోతో సినిమా ఉండనుందని వినిపిస్తోంది. అవును, హీరో సూర్యతో బోయపాటి సినిమా ఉంటుందని గతకొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.
Details
సూర్యతో యాక్షన్ సినిమా ప్లాన్ చేస్తున్న బోయపాటి?
సూర్యతో మాస్ యాక్షన్ సినిమాను రూపొందించేందుకు బోయపాటి శ్రీను సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ విషయమై అధికారిక సమాచారం ఇంకా రాలేదు.
అయితే హీరో సూర్యతో బోయపాటి తెరకెక్కించే సినిమాకు నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో విజయ్ హీరోగా వారసుడు సినిమాను తమిళంలో తెరకెక్కించిన అనుభవం దిల్ రాజుకు ఉంది.
ఆ అనుభవంతోనే మరోసారి తెలుగు దర్శకుడితో తమిళ హీరోతో సినిమా చేసేందుకు దిల్ రాజు ఆసక్తి చూపిస్తున్నారని వినికిడి.
సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ వార్తలు ఎప్పుడు నిజమవుతాయో చూడాలి. అదలా ఉంచితే, దిల్ రాజు ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా గేమ్ ఛేంజర్ సినిమాను రూపొందిస్తున్నారు.