దిల్ రాజు బ్యానర్ లో కీర్తి సురేష్: పాత రూట్లోకి మారుతున్న మహానటి హీరోయిన్?
తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన అలనాటి హీరోయిన్ సావిత్రిని మహానటి సినిమాలో తనదైన నటనతో మన కళ్ళముందు కనిపించేలా చేసింది కీర్తి సురేష్. మహానటి ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. అయితే మహానటి తర్వాత కీర్తి చేసిన సినిమాలేవీ మహానటి సినిమా స్థాయిని అందుకోలేకపోయాయి. ఇలాంటి టైమ్ లోనే దసరా రిలీజైంది. నాని హీరోగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ కనిపించింది. తెలంగాణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా, బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం కీర్తి సురేష్, మరో కొత్త సినిమాకు ఓకే చెప్పిందని తెలుస్తోంది. ఆ కొత్త సినిమాకు దిల్ రాజు నిర్మాతగా ఉండనున్నారని అంటున్నారు.
లేడీ ఓరియంటెడ్ సినిమాలో కీర్తి
మహిళా ప్రాధాన్యమున్న సినిమాను నిర్మించేందుకు దిల్ రాజు ప్రయత్నిస్తున్నారని, ఆ సినిమాలో కీర్తి సురేష్ అయితే బాగుంటుందని ఆమెను అడిగారని సమాచారం. కీర్తి సురేష్ కూడా ఒప్పేసుకుందని టాక్. మహానటి తర్వాత కీర్తి నటించిన లేడీ ఓరియంటెడ్ సినిమాలైన గుడ్ లక్ సఖి, మిస్ ఇండియా, పెంగ్విన్ చిత్రాలకు ప్రేక్షకుల నుండి సరైన స్పందన రాలేదు. ఇప్పుడు మళ్ళీ లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతోంది. మరి ఈ సినిమాతోనైనా మంచి హిట్ అందుకుంటుందేమో చూడాలి. ప్రస్తుతం ఈ సినిమాను తెరకెక్కించే దర్శకుడిని వెతుకుతున్నారట. అదలా ఉంచితే, చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమాలో కిర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమా, ఆగస్టు 11న రిలీజ్ అవుతుంది.