Loading...
Anjali Devi: తెలుగువారి సీతమ్మ.. అంజలీదేవి సినీ ప్రస్థానం ఎంత ప్రత్యేకమో తెలుసా?
తెలుగువారి సీతమ్మ.. అంజలీదేవి సినీ ప్రస్థానం ఎంత ప్రత్యేకమో తెలుసా?

Anjali Devi: తెలుగువారి సీతమ్మ.. అంజలీదేవి సినీ ప్రస్థానం ఎంత ప్రత్యేకమో తెలుసా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 24, 2026
09:57 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయుల జీవనవిధానంలో అంతర్భాగంగా మారిన రామాయణ మహాకావ్యంపై ఎన్నో సినిమాలు వచ్చినా.. వాటన్నింటినీ మించి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన చిత్రం 'లవకుశ' (1963). శ్రీరాముడిగా ఎన్టీఆర్‌ నటించగా.. సీత పాత్రలో అంజలీదేవి తన నటనతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు. ఆ సినిమా ప్రభావం ఎంతలా ఉందంటే.. గ్రామాలకు వెళ్లినప్పుడు మహిళలు ఆమెకు పాదాభివందనం చేసేవారని, రైతులు వరికంకులు తీసుకొచ్చి ఆమె కాళ్ల దగ్గర పెట్టేవారని చెబుతారు. అయితే సీతగా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన అంజలీదేవి సినీ ప్రయాణం అంత సులభంగా సాగలేదు. కెరీర్‌ తొలినాళ్లలో వ్యాంప్‌ తరహా పాత్రలు పోషించిన ఆమె.. ఆ తర్వాత కరుణరసాత్మకమైన సీతమ్మ పాత్రను అద్భుతంగా ఆవిష్కరించి తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు.

వివరాలు

చంటిబిడ్డల తల్లిగా తొలి సినిమా..

అంజలీదేవి 1926ఆగస్టు 24న నాటి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో జన్మించారు. ఆమెకు ఇది శతజయంతి సంవత్సరం.

1947లో వచ్చిన 'గొల్లభామ' ఆమె తొలి చిత్రం. అప్పటికే ఆమె ఇద్దరు చంటిబిడ్డల తల్లి కావడం విశేషం. కాకినాడలోని 'యంగ్‌ మెన్స్‌ హ్యాపీ క్లబ్‌' నాటకాల ద్వారా నటనలో శిక్షణ పొందిన ఆమె.. సినిమాల్లోకి వచ్చిన తర్వాత క్రమంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

తొలినాళ్లలోనే విభిన్నమైన పాత్రలు పోషించి తన ప్రతిభను చాటుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన 'కీలుగుర్రం' (1949)లో పగటిపూట రాణిగా, రాత్రివేళ ఏనుగులు, గుర్రాలను తినే రాకాసిగా కనిపించి మెప్పించారు.

తనకు నటనలో మార్గదర్శిగా నిలిచిన సి.పుల్లయ్య దర్శకత్వంలో తెరకెక్కిన 'పక్కింటి అమ్మాయి' (1953)లో కామెడీ పాత్రలోనూ ప్రేక్షకులను అలరించారు.

వివరాలు

నిర్మాతగానూ సక్సెస్‌..

ఆ తర్వాత సాత్విక పాత్రలకు అంజలీదేవి పెట్టింది పేరుగా మారారు. 'రంగులరాట్నం', 'తాత-మనవడు', 'లక్ష్మీనివాసం', 'బడిపంతులు' వంటి సాంఘిక చిత్రాలతో పాటు 'సతీ సక్కుబాయి', 'చెంచులక్ష్మి', 'పాండురంగ మహాత్మ్యం' వంటి భక్తిరస చిత్రాలు ఆమెకు విశేషమైన గుర్తింపును తీసుకొచ్చాయి.

నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగానూ అంజలీదేవి తనదైన ముద్ర వేశారు. 'అంజలీ పిక్చర్స్‌' బ్యానర్‌పై సుమారు 27 చిత్రాలను నిర్మించారు.

'అనార్కలి', 'సువర్ణసుందరి', 'భక్తతుకారాం', 'మహాకవి క్షేత్రయ్య' వంటి ఆణిముత్యాల్లాంటి చిత్రాలు ఈ సంస్థ నుంచి వచ్చాయి. ఈ చిత్రాల్లో చాలా వాటిలో అక్కినేని నాగేశ్వరరావు కథానాయకుడిగా నటించారు.

అంజలీ పిక్చర్స్‌ నిర్మించిన చివరి చిత్రాల్లో ఒకటైన 'చండీప్రియ' (1980)లో చిరంజీవి హీరోల్లో ఒకరిగా నటించారు.

ADVERTISEMENT

వివరాలు

480 సినిమాల్లో నటన..

అంజలీదేవి భర్త, ప్రముఖ సంగీత దర్శకుడు పి.ఆదినారాయణరావు ఈ చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు.

'రాజశేఖరా! నీపై మోజు తీరలేదురా', 'పిలువకురా.. అలుగకురా నలుగురిలో నను ఓ రాజా!', 'ఘనాఘన సుందరా.. కరుణారస మందిరా' వంటి ఎన్నో ఎవర్‌గ్రీన్‌ పాటలకు ఆయనే స్వరకర్త.

కాకినాడలోని క్లబ్‌లో అంజలీదేవిని నటిగా తీర్చిదిద్దడంలోనూ ఆదినారాయణరావు కీలక పాత్ర పోషించారు.

దాదాపు ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళ, హిందీ తదితర భాషల్లో అంజలీదేవి సుమారు 480 చిత్రాల్లో నటించారు.

తన కెరీర్‌లో కథానాయికలుగా నటించిన ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌లకు ఆ తర్వాతి రోజుల్లో పలు చిత్రాల్లో తల్లిగా నటించడం ఆమె బహుముఖ నటనా ప్రయాణానికి నిదర్శనం. ఉత్తమ నటిగా ఆమె నాలుగు ఫిలింఫేర్‌ అవార్డులు అందుకున్నారు.

ADVERTISEMENT

వివరాలు

ఆధ్యాత్మిక బాటలో చివరి రోజులు..

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆమెను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య పురస్కారంతో గౌరవించింది.

అంజలీదేవి, అక్కినేని నాగేశ్వరరావు కుటుంబాల మధ్య సన్నిహిత అనుబంధం ఉండేది. మద్రాసులో ఉన్న సమయంలో ఇరు కుటుంబాల ఇళ్లు పక్కపక్కనే ఉండేవి.

ఏఎన్నార్‌ ఇంటి ఆవరణలో షటిల్‌ కోర్టు ఉండేది. ఆయన భార్య అన్నపూర్ణమ్మతో కలిసి షటిల్‌ ఆడేందుకు అంజలీదేవి చుట్టూ తిరిగి లోపలికి వెళ్లడం బద్ధకించి గోడ దూకి అవతలికి వెళ్లేవారని అక్కినేని ఓ సభలో సరదాగా చెప్పిన సందర్భం ఉంది.

90వ దశకంలో వచ్చిన 'బృందావనం', 'పోలీస్‌ అల్లుడు' వంటి చిత్రాల్లోనూ ఆమె నటించారు. దాదాపు పరిపూర్ణమైన జీవితాన్ని గడిపిన అంజలీదేవికి ఇద్దరు కుమారులు. వారు విద్యాధికులైనా సినీరంగంలోకి రాలేదు.

వివరాలు

చివరి రోజుల్లో ఆధ్యాత్మిక జీవితం

నిజ జీవితంలో పుట్టపర్తి సత్యసాయి బాబా భక్తురాలైన అంజలీదేవి చివరి రోజుల్లో పూర్తిగా ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపారు.

శిర్డీ సాయిబాబా జీవిత చరమాంకం, పుట్టపర్తి సత్యసాయి బాబా బాల్య విశేషాల ఆధారంగా 'శిర్డీ సాయి పర్తిసాయి దివ్య కథ' అనే టెలీ సీరియల్‌ను నిర్మించడంతో పాటు అందులో నటించారు.

చివరకు 2014లో చెన్నైలో కన్నుమూశారు. అయితే సీతమ్మగా, నటిగా, నిర్మాతగా ఆమె తెలుగు ప్రేక్షకుల మనసుల్లో మిగిల్చిన జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ చెరిగిపోవు.

ADVERTISEMENT