Rajinikanth: రజనీకాంత్ ఆరోగ్యంపై డాక్టర్లు కీలక ప్రకటన
సూపర్ స్టార్ రజనీకాంత్ ఈరోజు ఉదయం అకస్మాత్తుగా అనారోగ్య సమస్యలతో చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. దీంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కార్డియాలజిస్ట్ సాయి సతీష్ నేతృత్వంలోని వైద్య బృందం రజనీకాంత్‌కు చికిత్స అందించింది. న్యూరాలజిస్ట్ బాలాజీ కూడా రజనీకాంత్‌ను పరీక్షించి వైద్య సహాయం అందించారు. రజనీకి ఒక్కసారిగా మూత్ర విసర్జన సమస్య రావడం వల్ల పొట్ట కింది భాగంలో వాపు ఏర్పడటంతో ఆసుపత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది. రజనీకాంత్‌కి వైద్యులు శస్త్రచికిత్స చేసి కడుపులో స్టెంట్ అమర్చారు. శస్త్రచికిత్స అనంతరం కొన్ని గంటల పాటు ఐసీయూలో ఉంచిన రజనీకాంత్‌ను ప్రస్తుతం సాధారణ వార్డుకు తరలించారని సమాచారం.
నిలిచిపోయిన 'కూలీ' షూటింగ్
గతంలో రజనీకాంత్‌కు కిడ్నీ మార్పిడి జరిగిన కారణంగా ఇన్ఫెక్షన్ సోకకుండా అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. రజనీకాంత్‌ను రెండు మూడు రోజుల పాటు వైద్యుల బృందం నిశితంగా పరిశీలించనున్నారు. రజనీకాంత్ అనారోగ్యం కారణంగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'కూలీ' సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తుండగా, శృతి హాసన్, నాగార్జున, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.