NC 25: నాగచైతన్య 25వ సినిమా దర్శకుడు,హీరోయిన్‌పై వస్తున్న వార్తలపై టీమ్ క్లారిటీ
ఈ వార్తాకథనం ఏంటి
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య కెరీర్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న 25వ చిత్రం (NC25)పై సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాకు 'బెదురులంక 2012' ఫేమ్ క్లాక్స్ దర్శకత్వం వహించనున్నారని, 'ఆకాశంలో ఒక తార' సినిమాతో వెండితెరకు పరిచయం కానున్న సాత్విక వీరవల్లి నాగచైతన్య సరసన కథానాయికగా నటించబోతున్నారని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రచారంపై నాగచైతన్య అధికారిక బృందం స్పందించింది.
వివరాలు
రూమర్లను, ఆధారాలు లేని వార్తలను నమ్మద్దు
NC25 ప్రాజెక్ట్‌పై అభిమానులు, ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి, కుతూహలాన్ని తాము అర్థం చేసుకుంటున్నామని టీమ్ తెలిపింది.
అయితే ఈ సినిమాకు సంబంధించిన ఏదైనా సమాచారం అధికారికంగా వెల్లడైన వేదికల నుంచే వస్తుందని స్పష్టం చేసింది.
సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న రూమర్లను, ఆధారాలు లేని వార్తలను నమ్మవద్దని అభిమానులు, ప్రేక్షకులను కోరింది.
ప్రాజెక్ట్‌కు సంబంధించిన దర్శకుడు, హీరోయిన్ తదితర వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని నాగచైతన్య టీమ్ స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా.. నాగచైతన్య ప్రస్తుతం దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కిస్తున్న 'వృషకర్మ' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. డిసెంబర్ 4న 'వృషకర్మ'ను గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
వివరాలు
గ్లిమ్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన
నాగచైతన్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రంగా 'వృషకర్మ'పై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.
మరోవైపు నాగచైతన్య 25వ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహించనున్నారు? కథానాయికగా ఎవరు నటించనున్నారు? అనే విషయాలు మాత్రం ప్రస్తుతానికి అధికారికంగా వెల్లడికాలేదు.
ఈ వివరాలపై స్పష్టత రావాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.