TV Anchor -Live-Unconcious-Lopa Mudra:లైవ్‌లో సొమ్మసిల్లి పడిపోయిన టీవీ యాంకర్
పశ్చిమ బెంగాల్ (West Bengal)లో దూరదర్శన్ (Doordarsan) యాంకర్ ఒకరు లైవ్‌లో వాతావరణ వార్తలు చదువుతూ సొమ్మసిల్లి పడిపోయారు. వాస్తవానికి దేశవ్యాప్తంగా అత్య«ధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేసవి తాపానికి ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఉదయం పదిగంటలు దాటగానే ఎవరికివారు ఇళ్లకు పరిమితమైపోతున్నారు. మధ్యాహ్నం వీచే వడగాడ్పులకు కొంతమంది వృద్ధులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఎప్పటికప్పుడు ఉష్ణోగ్రతలను ప్రకటిస్తూ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మీడియా లో వాతావరణ శాఖ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఇలా వడగాడ్పులకు సంబంధించిన వార్తలు చదువుతూ టీవీలైవ్ లో టీవీ యాంకర్ లోపాముద్ర సిన్హా సొమ్మసిల్లి పడిపోయింది.
యాంకర్ పడిపోయిన విషయం.. స్వయంగా సోషల్ మీడియా లో పోస్ట్
వెంటనే సిబ్బంది తేరుకుని అప్రమత్తంగా వ్యవహరించడంతో కొద్దిసేపటి తర్వాత సదరు యాంకర్ ఆ లైవ్ కార్యక్రమాన్ని కొనసాగించింది. ఇంతకీ ఆమెకు బీపీ పడిపోవడం వల్ల కళ్లు తిరిగిపడిపోయిన ట్లు స్వయంగా ఆ యాంకరే సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. ''ప్రత్యక్ష ప్రసారం మొదలు కాగానే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అయినా లైవ్ కార్యక్రమాన్ని కొనసాగించాను. చాలాసేపు వార్తలు చదువుతుండటంతో మధ్యలో కనీసం మంచినీళ్లైనా తీసుకోకపోవడంతో శరీరంలో బీపీ పడిపోయింది. కళ్లు చీకట్లు కమ్ముకున్నాయి. తర్వాత ఏమైందో తెలియదు. కొద్దిసేపటికి తోటి సిబ్బంది సపర్యలు చేయడం మాత్రమే తెలిసింది'' అని పోస్ట్ లో పేర్కొంది.
పోస్ట్ పై నెటిజన్ల స్పందన
సోషల్ మీడియా ద్వారా పంచుకున్న ఈ పోస్ట్ పై పలువురు నెటిజన్లు బాగా స్పందిస్తున్నారు. లోపా ముద్ర త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ లో పలు చోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.