LOADING...
iBomma Ravi : కస్టడీలో ఐబొమ్మ రవి.. ఐదోరోజు విచారణలో కీలక వివరాలు!
కస్టడీలో ఐబొమ్మ రవి.. ఐదోరోజు విచారణలో కీలక వివరాలు!

iBomma Ravi : కస్టడీలో ఐబొమ్మ రవి.. ఐదోరోజు విచారణలో కీలక వివరాలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 24, 2025
09:36 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐ బొమ్మ కేసులో కీలక పాత్రధారి ఇమ్మడి రవిపై జరుగుతున్న కస్టడీ విచారణ ఐదో రోజుకు చేరుకుంది. నేటితో ఆయన కస్టడీ గడువు ముగియనున్న నేపథ్యంలో గత నాలుగు రోజులుగా సైబర్ క్రైమ్ అధికారులు అతనిని తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. అయితే విచారణ మొత్తం ఇమ్మడి రవి అస్పష్టంగా, పొంతన లేని సమాధానాలు ఇస్తూ, దర్యాప్తు దిశను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని అధికారులు తెలిపారు. యూకే, కరేబియన్ దీవుల్లో పనిచేస్తున్న సిబ్బంది, విదేశీ సర్వర్‌లకు సంబంధించిన ఆధారాలు చూపిస్తూ ప్రశ్నించినా, రవి సరైన సమాధానాలు ఇవ్వలేదని విచారణ బృందం పేర్కొంది. డేటా అంతా విదేశాల్లో ఉందన్నారు.

Details

కొద్ది రోజుల ముందే డిలీట్ చేసినట్టు సమాచారం

తనకు సహకరించిన వారు ఎవరూ లేరని చెబుతూ తప్పించుకోవడానికి ప్రయత్నించినట్లు సమాచారం. అంతేకాకుండా, హార్డ్‌డిస్క్‌లలో ఉన్న సినిమా ఫైల్స్ మినహా, మిగిలిన డేటాను అరెస్టుకు కొద్ది రోజుల ముందే డిలీట్ చేసినట్టు విచారణలో బయటపడింది. ఈ కేసులో ఇమ్మడి రవి కదలికలను హైదరాబాద్ సైబర్ క్రైమ్ అధికారులు దాదాపు మూడు నెలల పాటు గమనించారు. చివరికి అతని ఈ-మెయిల్ లింకుల ద్వారానే అతడి ప్రాథమిక గుర్తింపు బయటపడింది. 'ఈ ఆర్ ఇన్ఫోటెక్' పేరుతో రిజిస్టర్ చేసిన డొమైన్‌లు, బ్యాంక్ ఖాతాల లావాదేవీలు, వాడిన క్రెడిట్-డెబిట్ కార్డుల వివరాలను సేకరించేందుకు సంబంధిత బ్యాంకులకు ఇప్పటికే నోటీసులు పంపించారు.

Details

నేరాన్ని అంగీకరించిన ఐ బొమ్మ రవి

విచారణ సమయంలో రవి స్వయంగా వెబ్‌సైట్ రూపొందించి పైరసీ సినిమాలను అప్లోడ్ చేసినట్లు అంగీకరించినట్లు తెలుస్తోంది. పైరసీ సినిమాలు చూడటం తనకు అలవాటు కాగా, అదే తనను ఈ దారికి లాగిందని అతడు పేర్కొన్నట్లు సమాచారం. అయితే కస్టడీ విచారణలో సరైన సమాచారం ఇవ్వకపోవడంతో, మరోసారి పోలీసు కస్టడీ కొరకు పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయని వర్గాలు వెల్లడించాయి.