Faisal Malik: 'రామాయణ'లో కుంభకర్ణుడిగా అదరగొట్టిన ఫైసల్ మాలిక్.. యష్‌కు రెండో స్థానం!
ఈ వార్తాకథనం ఏంటి
నితేష్ తివారీ దర్శకత్వంలో, నమిత్ మల్హోత్రా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'రామాయణ' చిత్రం నవంబర్ 5న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవి వంటి అగ్ర తారలు నటించిన ఈ సినిమాలో రాముడు, రావణుడి పాత్రలపైనే ప్రేక్షకుల దృష్టి ఉంటుందని అంతా భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. ఆయనే 'పంచాయత్' వెబ్ సిరీస్‌లో ప్రహ్లాద్ చాచాగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫైసల్ మాలిక్.
వివరాలు
యష్‌ను దాటేసిన కుంభకర్ణుడు
'రామాయణ'లో కుంభకర్ణుడిగా నటించిన ఫైసల్ మాలిక్.. తన ఆన్‌స్క్రీన్ అన్నయ్య, పాన్ ఇండియా స్టార్ యష్‌ను వెనక్కి నెట్టి IMDb వారపు ట్రెండింగ్ జాబితాలో మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు.
రావణుడిగా మెప్పించిన యష్ రెండో స్థానంలో నిలవడం విశేషం. 'పంచాయత్' వెబ్ సిరీస్‌లో సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఫైసల్.. ఇప్పుడు వెండితెరపై తనదైన నటనతో స్టార్ హీరోలకే గట్టి పోటీ ఇస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆయన పేరే వినిపిస్తోంది.
వివరాలు
థియేటర్లలో ఫైసల్ ఎంట్రీ సీన్‌కు ఫ్యాన్స్ ఫిదా
ముఖ్యంగా 'రామాయణ'లో ఫైసల్ మాలిక్ ఎంట్రీ సీన్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. గతంలో 'పంచాయత్' సిరీస్ సమయంలో ఆయనపై మీమ్స్, రీల్స్ వైరల్ అయ్యాయి.
అయితే ఈసారి అభిమానుల సందడి మరో స్థాయికి చేరింది. ప్రేక్షకులు థియేటర్లలోనే ఆయన ఎంట్రీ సీన్‌ను వీడియోలుగా రికార్డ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్నారు.
లక్షలాది వ్యూస్‌తో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. అభిమానులు తనను ట్యాగ్ చేస్తూ చూపిస్తున్న ప్రేమకు ఫైసల్ మాలిక్ ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.
వివరాలు
వీఎఫ్‌ఎక్స్ పాత్ర కోసం ప్రత్యేక శిక్షణ
కుంభకర్ణుడి వంటి భారీ పాత్రలో ఒదిగిపోవడం అంత సులభం కాలేదని ఫైసల్ మాలిక్ చెబుతున్నారు.
'రామాయణ' పూర్తిగా వీఎఫ్‌ఎక్స్ ఆధారంగా రూపొందిన చిత్రం కావడంతో, ఇప్పటివరకు తాను నేర్చుకున్న సాధారణ నటన పద్ధతులను పక్కన పెట్టాల్సి వచ్చిందని వివరించారు.
ఈ పాత్ర కోసం చిత్ర బృందం ప్రత్యేక శిక్షణ ఇచ్చిందని, అది లేకపోతే కుంభకర్ణుడి పాత్రకు న్యాయం చేయడం కష్టమయ్యేదని పేర్కొన్నారు.
ముఖ్యంగా సినిమా సెకండాఫ్‌లో రావణుడిగా నటించిన యష్‌తో వచ్చే సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని తెలిపారు.
కుంభకర్ణుడి చేతిపై రావణుడు నడుస్తూ అతన్ని ఆశీర్వదించే సన్నివేశాన్ని ఎంతో జాగ్రత్తగా చిత్రీకరించారట. ఇందులో కంటి కదలికలు, హావభావాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, సన్నివేశాన్ని విడివిడిగా షూట్ చేసినట్లు ఫైసల్ వెల్లడించారు.
వివరాలు
'అవతార్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' స్థాయి అనుభవం
ఇప్పటివరకు 'అవతార్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' వంటి హాలీవుడ్ చిత్రాల మేకింగ్ వీడియోలను మాత్రమే చూసిన తాము.. ఇప్పుడు స్వయంగా అలాంటి అద్భుతమైన చిత్ర నిర్మాణ ప్రక్రియలో భాగం కావడం జీవితంలో మర్చిపోలేని అనుభవమని ఫైసల్ ఆనందం వ్యక్తం చేశారు.
భారతీయ సినిమా చరిత్రలో ఇంతటి భారీ స్థాయి చిత్రం మళ్లీ రాదేమోనని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
రణబీర్ కపూర్, యష్, సాయి పల్లవి, రవి దూబే, అరుణ్ గోవిల్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి భారీ తారాగణం ఉన్నప్పటికీ.. తన నటనతో కుంభకర్ణుడి పాత్రలో మెప్పించిన ఫైసల్ మాలిక్ IMDb ట్రెండింగ్ జాబితాలో అగ్రస్థానంలో నిలవడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.