FDA: షారుక్, అజయ్ దేవ్‌గణ్, టైగర్ ష్రాఫ్‌లకు ఫుడ్ సేఫ్టీ విభాగం నోటీసులు
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ ప్రముఖ నటులు షారుక్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) షోకాజ్ నోటీసులు పంపింది. రాష్ట్రంలో నిషేధం ఉన్న పాన్ మసాలా ఉత్పత్తిని ఓ ప్రకటన ద్వారా పరోక్షంగా ప్రోత్సహించారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది. పాన్ మసాలాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో తమ భాగస్వామ్యాన్ని వెంటనే నిలిపివేయాలని నోటీసుల్లో నటులను ఆదేశించింది. అంతేకాకుండా.. వారి అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఉన్న సంబంధిత ప్రకటనలు, ప్రచార కంటెంట్‌ను తొలగించాలని సూచించింది. ఈ ప్రచారానికి సంబంధించి చేసుకున్న ఒప్పందాలు, అందుకున్న చెల్లింపులు తదితర వివరాలను కూడా అధికారులకు సమర్పించాలని పేర్కొంది.
వివరాలు
పొగాకు ఉత్పత్తులను ప్రోత్సహించే విధంగా ప్రకటన..
మహారాష్ట్ర ఆహార భద్రతా విభాగం అధిపతి తుకారామ్ ముంఢే ఈ నోటీసులను ఆగస్టు 11న జారీ చేశారు.
అయితే ఈ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. సంబంధిత ప్రకటన వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఉండటంతో పాటు.. పరోక్షంగా పాన్ మసాలా వినియోగం వైపు ప్రజలను ప్రోత్సహించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
ఈ ప్రకటనలో గతంలో షారుక్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్‌లతో పాటు అక్షయ్ కుమార్ కూడా నటించారు.
అయితే పొగాకు ఉత్పత్తులను ప్రోత్సహించే విధంగా ప్రకటన ఉందంటూ అభిమానులు, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలో అక్షయ్ కుమార్ ఆ ప్రకటన నుంచి తప్పుకున్నారు.