FEFSI : తమిళ సినీ పరిశ్రమలో సమ్మెపై ఫెఫ్సీ కీలక ప్రకటన.. నిర్మాతలకు కీలక విజ్ఞప్తి
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ చిత్ర పరిశ్రమలో మరోసారి సమ్మె పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో సినీ కార్మిక సమాఖ్య (ఫెఫ్సీ-FEFSI) కీలకంగా స్పందించింది. నిర్మాతలు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను తాము అర్థం చేసుకుంటున్నామని పేర్కొన్న ఫెఫ్సీ.. సమ్మె కారణంగా వేలాది మంది సినీ కార్మికులు, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం, తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి తమ నిర్ణయాన్ని పునఃపరిశీలించి, చర్చల ద్వారా సామరస్యపూర్వక పరిష్కారం కనుగొనాలని విజ్ఞప్తి చేసింది. సెప్టెంబర్ 1 నుంచి కొత్త సినిమాల షూటింగ్‌లు, చిత్రాల విడుదలతో పాటు అన్ని రకాల సినీ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు నిర్మాతల మండలి ప్రకటించిన విషయం తెలిసిందే.
వివరాలు
రోజువారి వేతన కార్మికుల కుటుంబాలపై సమ్మె ప్రభావం
ఈ నిర్ణయంపై ఫెఫ్సీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నిర్మాతల న్యాయమైన సమస్యలను పరిష్కరించడాన్ని తాము ఎప్పుడూ వ్యతిరేకించమని స్పష్టం చేసిన ఫెఫ్సీ.. అయితే ఏకపక్ష నిర్ణయంతో మొత్తం చిత్ర పరిశ్రమను స్తంభింపజేయడం సరైన పరిష్కారం కాదని పేర్కొంది.
చిత్ర పరిశ్రమపైనే ఆధారపడి జీవించే రోజువారీ వేతన కార్మికులు, వారి కుటుంబాలపై సమ్మె తీవ్ర ప్రభావం చూపుతుందని ఫెఫ్సీ ఆవేదన వ్యక్తం చేసింది.
ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేలాది మంది కార్మికులు, ఈ బంద్ కారణంగా మరింత తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడతారని తెలిపింది.
వివరాలు
2023 నాటి సుదీర్ఘ సమ్మెను గుర్తుచేసిన ఫెఫ్సీ
తాజా పరిణామాల నేపథ్యంలో 2023లో విశాల్ అధ్యక్షతన జరిగిన 45 నుంచి 50 రోజుల సుదీర్ఘ సమ్మెను ఫెఫ్సీ గుర్తుచేసింది.
ఆ సమయంలో ప్రభుత్వం సమక్షంలో నిర్మాతలు, థియేటర్ల యజమానులు, కార్మిక సంఘాల మధ్య త్రైపాక్షిక చర్చలు జరిగాయని పేర్కొంది.
ఆ చర్చల్లో పరిశ్రమకు సంబంధించిన అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ.. వాటిలో మెజారిటీ నిర్ణయాలు ఇప్పటికీ అమలులోకి రాలేదని ఫెఫ్సీ గుర్తుచేసింది.
సమస్య తలెత్తిన ప్రతిసారీ షూటింగ్‌లు నిలిపివేయడం, ఆ తర్వాత చర్చలు నిర్వహించడం, చర్చల అనంతరం తీసుకున్న నిర్ణయాలను మళ్లీ అమలు చేయకపోవడం వల్ల చిత్ర పరిశ్రమకు ఎలాంటి ప్రయోజనం ఉండదని ఫెఫ్సీ స్పష్టం చేసింది.
ప్రతిసారీ సమ్మెలు, బంద్‌లకు వెళ్లడం వల్ల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించదని పేర్కొంది.
వివరాలు
పరిశ్రమ భవిష్యత్తు కోసం కలిసి పనిచేద్దాం
ఆందోళనలు, నిరసనలు, సమ్మెల కారణంగా నిర్మాతలు, సినీ కార్మికులు మాత్రమే కాకుండా మొత్తం చిత్ర పరిశ్రమ కోలుకోలేని నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఫెఫ్సీ ఆందోళన వ్యక్తం చేసింది.
పరిశ్రమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అన్ని వర్గాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం, నిర్మాతల మండలితో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఫెఫ్సీ స్పష్టం చేసింది.
సినీ కార్మికులు, వారి కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సెప్టెంబర్ 1 నుంచి చేపట్టనున్న బంద్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నిర్మాతల మండలికి విజ్ఞప్తి చేసింది.