Ananta Sriram:హైందవ ధర్మంపై దాడి చేస్తున్న సినిమాలను బహిష్కరించాలి.. అనంత శ్రీరామ్ పిలుపు
ఈ వార్తాకథనం ఏంటి
సినిమాల్లో హైందవ ధర్మంపై దాడులు జరుగుతున్నాయని ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ పేర్కొన్నారు.
గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన 'హైందవ శంఖారావం' సభలో ఆయన మాట్లాడారు.
వాల్మీకి రామాయణం, వ్యాస భారతం భారతీయ సాహిత్యానికి రెండు కళ్లుగా ఉంటాయని చెప్పారు. అయితే వాటిని వినోదం కోసం వక్రీకరించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైందవ ధర్మాన్ని అవమానించే సినిమాలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.
ఇక అనంత శ్రీరామ్ తన ప్రసంగంలో సినీ పరిశ్రమలో హైందవ ధర్మంపై జరిగిన దాడుల విషయంలో హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పారు.
సినిమా ఒక కళ అని, అయితేఈ వ్యాపార ఆలోచనలో హిందూ ధర్మాన్ని అవమానించే విధంగా చిత్రాలు తీస్తున్నారని పేర్కొన్నారు.
Details
హిందూ ధర్మాన్ని అవమానించే సినిమాలను నిషేధించాలి
పురాణాలను, ఇతి హాసాలను వక్రీకరించి పాత్రల గొప్పతనాన్ని తగ్గిస్తున్నారని, కేవలం వినోదం కోసం వాల్మీకి, వ్యాసుల రచనలను మార్చేస్తున్నారని, ఇది హిందూ సమాజం తట్టుకోలేని విషయమని అన్నారు.
తన 15 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఒక దర్శకుడికి పాట రాయలేదని, అందుకు కారణం ఆయన హైందవ ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న సినిమాలకు పనిచేయడమేనని పేర్కొన్నారు.
హిందూ ధర్మాన్ని అవమానించే సినిమాలను ప్రభుత్వం వెంటనే నిషేధించాలన్నారు. లేకపోతే హిందువులే ఆ సినిమాలను పూర్తిగా బహిష్కరించాలన్నారు.
అప్పుడు మాత్రమే హిందూ ధర్మానికి గౌరవం వస్తుందని అనంత శ్రీరామ్ హితవు పలికారు.
ఆలయాల గౌరవం, హైందవ సంప్రదాయాల పరిరక్షణకు పెద్దఎత్తున హిందువులు చైతన్యం చెందడం సంతోషకరమని అనంత శ్రీరామ్ అభిప్రాయపడ్డారు.