ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా సింపుల్ గా జీవిస్తున్న గుమ్మడి నర్సయ్య జీవితంపై బయోపిక్: మొదటి పాట విడుదల
రాజకీయ నాయకుడిగా, ఎమ్మెల్యే పదవిలో ఉండి కూడా సాధారణంగా జీవించడం వీలుకాని పని. కానీ గుమ్మడి నర్సయ్య మాత్రం వీలు చేసిచూపించారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా సాధారణ జీవితాన్ని గడిపారు ఆయన. అసెంబ్లీకి ఆటోలో వచ్చేవారంటే ఆయన సింప్లిసిటీ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఎమ్మెల్యేగా ఆస్తులు సంపాదించడం కాదు, ప్రజల ప్రేమను గెలుచుకున్న నాయకుడాయన. ప్రస్తుతం గుమ్మడి నర్సయ్యపై బయోపిక్ రాబోతుంది. రాజకీయాల్లో సింప్లిసిటీ సాధ్యం కాదని నమ్మే వారందరికీ గుమ్మడి నర్సయ్య జీవితాన్ని ఉదాహరణగా చూపించేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. తాజాగా ఈ సినిమా నుండి పాటను రిలీజ్ చేసారు. గుమ్మడి నర్సయ్య పుట్టినరోజు సందర్భంగా రిలీజైన ఈ పాటలో గుమ్మడి నర్సయ్య గొప్పదనం గురించి చెప్పుకొచ్చారు.
ఆకట్టుకుంటున్న సాహిత్యం
బతకడానికో, బతుకుదెరువుకో రాజకీయమంటే నువ్వొప్పవులే, బతుకులు మార్చే బందూకై నువ్వు బయలుదేరినావులే, చరితలోనా ఏ కథలు చూసినా జనము మెచ్చిన నాయకులే, నువ్వు మాత్రమే నాయకులెందరో మెచ్చిన నేతవే అనే లిరిక్స్ గుమ్మడి నర్సయ్య రాజకీయ జీవితాన్ని ఒక్క మాటలో చెప్పేస్తున్నాయి. నీ తండ్రి పంచిన రెండెకరాలే నీ పొట్టకూడు, సర్కారు ఇచ్చిన ఆ పెంకుటిల్లే నిన్ను కాచే గూడు అనే వాక్యాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ పాటకు సంగీతాన్ని, సాహిత్యాన్ని చరణ్ అర్జున్ అందించారు. దివ్యా మాలిక, చరణ్ అర్జున్ కలిసి ఈ పాటను పాడారు. డార్క్ టు లైట్ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాను పరమేశ్వర్ హివ్రాలే డైరెక్ట్ చేస్తున్నారు.