Shrasti Verma: 'ఢీ' కంటెస్టెంట్ టు పొలిటికల్ ఎంట్రీ.. బీజేపీలో చేరిన శ్రష్టి వర్మ!
ఈ వార్తాకథనం ఏంటి
డ్యాన్స్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ బీజేపీలో చేరారు. తెలంగాణ భాజపా రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శ్రష్టి వర్మతో పాటు మరికొందరు కూడా ఈ సందర్భంగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులు ఏకమవుతున్న సమయంలో యువత రాజకీయాల్లోకి రావడం, అందులోనూ బీజేపీలో చేరడం హర్షణీయమని రామచందర్‌రావు పేర్కొన్నారు. శ్రష్టి వర్మ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావాలో పుట్టి పెరిగారు. ఆమె తండ్రి వ్యాపారం చేసేవారు కాగా.. తల్లి ఇంటి బాధ్యతలు చూసుకునేవారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన శ్రష్టికి ఓ చెల్లెలు ఉన్నారు. 12వ తరగతి వరకు చదువుకున్న ఆమెకు చిన్నతనం నుంచే డ్యాన్స్‌పై ఆసక్తి ఉండేది.
వివరాలు
జాతీయ స్థాయి కార్యక్రమాల్లో నృత్య ప్రదర్శన
అయితే భవిష్యత్తులో డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా మారాలని తాను ఎప్పుడూ అనుకోలేదని.. పైలెట్ కావాలనుకున్నానని గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
స్కూల్‌లో జరిగే కార్యక్రమాల్లో డ్యాన్స్ ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా ఆమెకు నృత్యంపై ఆసక్తి క్రమంగా పెరిగింది.
అనంతరం భరతనాట్యం కూడా నేర్చుకున్నారు. కేవలం 8 ఏళ్ల వయసులోనే 'తాజ్ మహోత్సవ్'తో పాటు పలు జాతీయ స్థాయి కార్యక్రమాల్లో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.
ఆ తర్వాత టెలివిజన్‌లో ప్రసారమయ్యే రియాలిటీ షోలపై ఆసక్తి పెంచుకున్నారు. ఏదో ఒక షోలో పాల్గొనాలని భావించారు.
ఒకసారి ఓ ఈవెంట్ కోసం ఛత్తీస్‌గఢ్ వెళ్లినప్పుడు.. అక్కడ ఈటీవీలో ప్రసారమయ్యే 'ఢీ' షో గురించి తెలుసుకున్నారు. అనంతరం అందులో కో-డ్యాన్సర్‌గా అవకాశం దక్కించుకున్నారు.
వివరాలు
అగ్ర తారలతో పనిచేసే అనుభవం
డ్యాన్స్‌పై ఆమెకున్న నిబద్ధత, ప్రత్యేకమైన స్టైల్ ప్రేక్షకులతో పాటు జడ్జిలను కూడా ఆకట్టుకుంది. దీంతో 'ఢీ-జోడీ'లో పాల్గొనే అవకాశం లభించింది.
ఈ సిరీస్ శ్రష్టి వర్మకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పలు సినిమాలకు పనిచేయడం ప్రారంభించారు.
సినీ పరిశ్రమలో నెమ్మదిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన శ్రష్టి వర్మ.. తక్కువ సమయంలోనే పలువురు అగ్ర తారల సినిమాల్లో పనిచేసే అవకాశం దక్కించుకున్నారు.
వివరాలు
అగ్ర హీరోల సినిమాల్లో..
'పుష్ప 2'లోని 'సూసేకి..' పాట ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అలాగే సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్'లోని 'నువ్వు కావాలయ్యా' పాటకు కూడా శ్రష్టి వర్మ నృత్యరీతులు సమకూర్చారు.
'క్రాక్', 'బీస్ట్', 'అల వైకుంఠపురములో', 'గేమ్ ఛేంజర్', 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్', 'మనమే' తదితర తెలుగు, తమిళ, హిందీ చిత్రాలకు ఆమె కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు.
ఇక టెలివిజన్ విషయానికొస్తే.. 'బిగ్‌బాస్ సీజన్ 9'లోనూ శ్రష్టి వర్మ కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు.
ఇలా డ్యాన్స్ రియాలిటీ షోల నుంచి సినీ పరిశ్రమలో కొరియోగ్రాఫర్‌గా ఎదిగిన ఆమె.. తాజాగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి భాజపాలో చేరారు.