Abhijeet :గాంధీ పాకిస్థాన్ పితామహుడు.. అభిజీత్ భట్టాచార్య వివాదాస్పద వ్యాఖ్యలు
బాలీవుడ్ ప్రముఖ నేపథ్య గాయకుడు అభిజీత్ భట్టాచార్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మహాత్మా గాంధీ, బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్‌ల గురించి మాట్లాడారు. ముఖ్యంగా గాంధీపై చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. మహాత్మా గాంధీ కంటే సంగీత ప్రపంచానికి ఆర్.డి. బర్మన్ గొప్పవారని, గాంధీని పొరపాటున భారత జాతిపిత అన్నారని, ఆయన పాకిస్థాన్‌కు జాతి పితామహుడు అని అభిజీత్ పేర్కొన్నారు. అభిజీత్ భట్టాచార్య 1000కి పైగా హిందీ సినిమాల్లో 6000 పాటలకు పైగా తన గాత్రం అందించారు. ఆయన ఏక్ చంచల్ శోఖ్ హసీనా, చాందినీ రాత్ హై, హర్ కసమ్ సే బడీ హై వంటి పాటలతో శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేశారు.
సోషల్ మీడియాలో దూమారం
ఖిలాడి, షోలా ఔర్ షబ్నం, బాద్‌షా, దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో పాడిన పాటలు ఆయనకు అపారమైన కీర్తిని తెచ్చాయి. హిందీ పాటలతో మాత్రమే కాకుండా, అభిజీత్ మరాఠీ, బెంగాలీ, తమిళం, భోజ్‌పురి, ఒడియా, పంజాబీ వంటి అనేక భాషల్లోనూ పాటలు పాడి తన ప్రతిభను ప్రదర్శించారు. 2014లో ఫోర్బ్స్ ఇండియా టాప్ 100 సెలబ్రిటీల జాబితాలో చోటు దక్కించుకున్న ఆయన, బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. మహాత్మా గాంధీని పాకిస్థాన్ జాతి పితామహుడిగా పేర్కొనడంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఈ వ్యాఖ్యలు అతని సంగీత ప్రస్థానానికి ఎటువంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.