Gang Leader: గ్యాంగ్ లీడర్ మూవీకి 35 ఏళ్లు.. ఇంకా తగ్గని క్రేజ్..డ్యాన్స్, ఫైట్స్‌తో రఫ్ఫాడించిన చిరు
ఈ వార్తాకథనం ఏంటి
డ్యాన్స్‌లు, ఫైట్లు, మాస్ డైలాగ్‌లతో ప్రేక్షకులను అలరించిన గ్యాంగ్ లీడర్ విడుదలై నేటికి 35 సంవత్సరాలు పూర్తయ్యాయి. చిరంజీవి, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 1991 మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 50కి పైగా థియేటర్లలో 100 రోజుల పాటు విజయవంతంగా ప్రదర్శించబడింది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో 162 రోజుల పాటు ఆడుతూ ప్రత్యేక రికార్డు సృష్టించింది. ఈ సినిమా విజయోత్సవాలను తిరుపతి, విజయవాడ, ఏలూరు, హైదరాబాద్ నగరాల్లో ఒకేసారి అట్టహాసంగా నిర్వహించారు. వేడుకలకు హీరోహీరోయిన్లు, దర్శకుడు సహా చిత్రబృందం హెలికాప్టర్‌లో హాజరుకావడం అప్పట్లో సంచలనంగా మారింది. తెలుగు సినీ పరిశ్రమలో అలాంటి కార్యక్రమం నిర్వహించడం అదే తొలిసారి కావడం విశేషం.
వివరాలు
అప్పట్లో ఘన విజయం..
దర్శకుడు విజయ బాపినీడుకు చిరంజీవిపై ఉన్న అభిమానంతో అప్పట్లో "చిరంజీవి" పేరుతో ప్రత్యేక రంగుల పత్రికను కూడా నిర్వహించేవారు. ఆ పత్రికలో ప్రధానంగా చిరంజీవి సినిమాలకు సంబంధించిన విషయాలనే ప్రచురించేవారని చెబుతారు. చిరంజీవి - విజయ బాపినీడు కలయికలో ఇప్పటికే 'మగ మహారాజు', 'హీరో', 'మహానగరంలో మాయగాడు', 'మగధీరుడు', 'ఖైదీ నెం.786' వంటి చిత్రాలు వచ్చాయి. అయితే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన అతిపెద్ద విజయంగా గ్యాంగ్ లీడర్ నిలిచింది. తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ చిత్రాన్ని తరువాత హిందీలో 'ఆజ్ కా గుండా రాజ్' పేరుతో మళ్లీ తెరకెక్కించగా, అక్కడ కూడా మంచి విజయాన్ని సాధించింది.
వివరాలు
ఇప్పటికీ మర్చిపోని డైలాగులు..
ఈ సినిమాలోని డైలాగులు అప్పట్లో ప్రేక్షకుల్లో విపరీతమైన ఆదరణ పొందాయి. "చేయి చూశావా... ఎంత రఫ్‌గా ఉందో... రఫ్ఫాడించేస్తా" అంటూ చిరంజీవి చెప్పిన మాస్ డైలాగ్ అభిమానులను ఉర్రూతలూగించింది. అలాగే రావుగోపాలరావు చెప్పిన "నీ తస్సరావాలా బొడ్డు" అనే డైలాగ్ కూడా బాగా ప్రాచుర్యం పొందింది. అదేవిధంగా "ధర్మం అధర్మం అయినప్పుడు కాళ్లు చేతులు తీస్తాను", "అన్నయ్యా... నీ చేతులకు ఎందుకు మట్టి అంటించుకుంటావు? వాడిని నాకు వదిలేయ్... వాడికి కరెక్ట్ మొగుడ్ని నేనే" వంటి డైలాగులు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
వివరాలు
అప్పట్లో ఆ సినిమా సంచలనం..
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... మొదట్లో చిరంజీవి ఈ సినిమా చేయడానికి ఆసక్తి చూపలేదట. దర్శకుడు విజయ బాపినీడు మెగాస్టార్ కోసం భిన్నమైన కథను సిద్ధం చేసి వినిపించగా, ఆ కథ చిరంజీవికి అంతగా నచ్చలేదు. దీంతో ఆయన నేరుగా సినిమా చేయనని చెప్పేశారు. తరువాత ఒక సందర్భంలో అదే కథను పరుచూరి బ్రదర్స్‌కు వినిపించారు. కథలో ఉన్న లోపాలను గుర్తించిన వారు కొన్ని కీలక మార్పులు, ఆసక్తికర అంశాలను జోడించారు. అనంతరం పరుచూరి గోపాలకృష్ణ ఆ కథను మళ్లీ చిరంజీవికి వినిపించగా, ఈసారి కథ బాగా నచ్చడంతో వెంటనే సినిమా చేయడానికి అంగీకరించారు.