Golden Globes: 2027 గోల్డెన్ గ్లోబ్స్‌కు ఏఐపై కొత్త నిబంధనలు
ఈ వార్తాకథనం ఏంటి
సినీ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల నిర్వహకులు ఏఐ వినియోగంపై కొత్త నిబంధనలు ప్రకటించారు. ఇటీవల ఆస్కార్ అవార్డులు కూడా ఇలాంటి మార్గదర్శకాలు తీసుకువచ్చిన నేపథ్యంలో, ఇప్పుడు గోల్డెన్ గ్లోబ్స్ సంస్థ 2027లో జరగనున్న వేడుకలకు సంబంధించిన స్పష్టమైన నియమాలను విడుదల చేసింది. ముఖ్యంగా సినిమాల్లో ఏఐ ఉపయోగంపై ప్రత్యేక దృష్టి సారించింది. హాలీవుడ్‌లో కృత్రిమ మేధ ప్రభావం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2027 అవార్డుల కోసం వచ్చే చిత్రాల్లో కృత్రిమ మేధ ఉపయోగం ఉండవచ్చని అంగీకరించినా, మానవ సృజనాత్మకతే ప్రధానంగా ఉండాలని స్పష్టం చేశారు. ఏ సన్నివేశంలో కృత్రిమ మేధను ఉపయోగించినా దాని వివరాలను తప్పనిసరిగా వెల్లడించాలి.
వివరాలు
అనుమతి లేకుండా ఎవరి స్వరం లేదా రూపాన్ని ఉపయోగిస్తే..
ముఖ్యంగా నటీనటుల స్వరం లేదా రూపాన్ని మార్చినట్లయితే ఆ సమాచారాన్ని స్పష్టంగా పేర్కొనాలని తెలిపారు. నటనా విభాగంలో ఎంట్రీలను పరిశీలించే సమయంలో కృత్రిమ మేధతో రూపొందించిన సన్నివేశాల కంటే సహజ నటనకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని నిర్వాహకులు వెల్లడించారు. కృత్రిమ మేధ సహాయంతో నటనకు మెరుగులు చేర్చినా, అసలు ప్రాముఖ్యత నటీనటుల ప్రతిభకే ఉంటుందని తెలిపారు. అలాగే, అనుమతి లేకుండా ఎవరి స్వరం లేదా రూపాన్ని ఉపయోగిస్తే అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.
వివరాలు
జనవరి 10న అవార్డు వేడుక
దర్శకత్వం, రచన, సంగీతం, యానిమేషన్ వంటి విభాగాల్లో కూడా ఇదే విధానం అమలు అవుతుందని తెలిపారు. కృత్రిమ మేధను కేవలం సహాయక సాధనంగా మాత్రమే ఉపయోగించాలి తప్ప, దానికి ప్రధాన స్థానం ఇవ్వకూడదని సూచించారు. వచ్చే ఏడాది జనవరి 10న ఈ అవార్డు వేడుక నిర్వహించనున్నట్లు వెల్లడించారు.