గ్రామీ అవార్డ్స్: బెంగళూరుకు చెందిన రిక్కీ కేజ్ ఖాతాలో మూడవ గ్రామీ అవార్డ్
సంగీత పురస్కారాల్లో విశిష్టమైనదిగా చెప్పుకునే గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం ఈరోజు జరిగింది. ప్రపంచ నలుమూలల నుండి ఈ అవార్డుల ప్రదానోత్సవానికి సంగీత కళాకారులు చేరుకున్న వేళ, నామినేషన్ దక్కించుకున్న వారిలో నుండి అవార్డు దక్కించుకున్న వారిని అనౌన్స్ చేసారు. ఇందులో బెంగళూరుకు చెందిన సంగీత దర్శకుడు రిక్కీ కేజ్ గ్రామీ అవార్డు అందుకున్నాడు. బెస్ట్ ఇమ్మర్సివ్ ఆల్బమ్ విభాగంలో డివైన్ టైడ్స్ అనే ఆల్బమ్ కి స్టీవర్ట్ కోప్ లాండ్, రిక్కీ కేజ్ అవార్డు గెలుచుకున్నారు. స్టీవర్ట్ కోప్ లాండ్ తో కలిసి చేసిన డివైన్ టైడ్స్ అనే ఆల్బమ్ కి బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్ 2022 క్యాటగిరీలోనూ అవార్డ్ గెలుచుకున్నాడు రిక్కీ కేజ్.
మూడు గ్రామీ అవార్డులతో దేశానికే గర్వకారణంగా రిక్కీ కేజ్
ప్రకృతిలోని గొప్పదనాన్ని వర్ణిస్తూ, హిమాలయాల నుండి స్పెయిన్ అడవుల దాకా డివైన్ టైడ్స్ ఆల్బమ్ లో చూపించారు. గ్రామీ అవార్డ్స్ కి నామినేట్ అయిన తర్వాత రిక్కీ కేజ్ మాట్లాడుతూ, రెండోసారి గ్రామీ అవార్డ్స్ కి నామినేట్ అవడం చాలా సంతోషాన్నిచ్చిందని అన్నాడు. అలాగే డివైన్ టైడ్స్ ఆల్బమ్ లోని పాటల్లో ఎన్నో సంస్కృతులు కనిపిస్తాయని, కాకపోతే మూలాలు మాత్రం భారతదేశానివే అని, భారతీయ సంగీతానికి ఇంతటి గౌరవం దక్కడం సంతృప్తిగా ఉందని రిక్కీ కేజ్ చెప్పుకొచ్చారు. డివైన్ టైడ్స్ గెలుచుకున్న రెండు అవార్డులతో మొత్తం రిక్కీ కేజ్ ఖాతాలో మూడు గ్రామీ అవార్డులు చేరాయి. 2015లో విండ్స్ ఆఫ్ సంసార్ ఆల్బమ్ కి మొదటి గ్రామీ గెలుచుకున్నాడు రిక్కీ కేజ్.