హ్యాపీ బర్త్ డే అట్లీ: రాజా రాణి నుండి మొదలుకుని వెయ్యికోట్ల జవాన్ వరకు ప్రయాణం
ఈ వార్తాకథనం ఏంటి
అట్లీ.. ఈ పేరు ఇప్పుడు ఇండియాలో మారు మోగిపోతుంది.
షారుక్ ఖాన్ హీరోగా రూపొందిన జవాన్ సినిమాకు అట్లీ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 1000కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకుపోతుంది.
ఇప్పటివరకు ఈ సినిమా 900కోట్ల వసూళ్ళు చేయగలిగింది. మరొక వారం రోజుల్లో 1000కోట్ల వసూళ్లను అందుకోగలుగుతుందని అంచనా.
ఇప్పటివరకు కోలీవుడ్ నుండి ఈ ఘనతను ఎవ్వరూ సాధించలేదు. కేవలం 5 సినిమాల అనుభవం ఉన్న అట్లీ సాధించేశాడు.
అట్లీ అసలు పేరు అరుణ్ కుమార్. టాప్ డైరెక్టర్ శంకర్ దగ్గర అట్లీ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు.
రజనీకాంత్ రోబో, తలపతి విజయ్ స్నేహితుడు సినిమాలకు అట్లీ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు.
Details
రాజా రాణి సినిమాతో అట్లీ ప్రయాణం మొదలు
అట్లీ తన 26ఏళ్ల వయసులో రాజా రాణి సినిమాతో దర్శకుడిగా మారిపోయాడు.
ఈ సినిమా థియేటర్ల వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాదు నయనతారకు రాజా రాణి చిత్రం మంచి కంబ్యాక్ అయింది.
రాజా రాణి తర్వాత తలపతి విజయ్ తో, తేరి(తెలుగులో పోలీస్), మెర్సల్ (అదిరింది), బిగిల్ (విజిల్) అనే చిత్రాలను తెరకెక్కించారు. ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దుమ్ముదులిపాయి.
పైన చెప్పిన నాలుగు సినిమాలతో కోలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా అట్లీ మారిపోయాడు. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తో తెరకెక్కించిన జవాన్ సినిమాతో భారతదేశంలోనే టాప్ డైరెక్టర్ గా ఎదిగిపోయాడు.
Details
అట్లీ సినిమాలపై కాపీ విమర్శలు
అట్లీ తీసిన ఐదు సినిమాలపై ఎన్నో రకాల కాపీ విమర్శలు వచ్చాయి.
రాజా రాణి సినిమాను మణిరత్నం తెరకెక్కించిన మౌనరాగం ఆధారంగా, మెర్సల్ సినిమాను కమలహాసన్ నటించిన అపూర్వ సోదరులు ఆధారంగా, షారుక్ ఖాన్ చక్ దే ఇండియా ఆధారంగా విజిల్ సినిమాను రూపొందించారని అన్నారు.
ఇప్పుడు జవాన్ సినిమాకు కూడా అలాంటి విమర్శలే వచ్చాయి. అయితే ఎన్ని విమర్శలు వచ్చినా తన పని తాను చేసుకుంటూ వరుసగా హిట్లు ఇస్తూనే ఉన్నాడు అట్లీ.
ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో సినిమా రూపొందే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
అదీగాక షారుక్ ఖాన్, తలపతి విజయ్ కాంబినేషన్లో మరో సినిమాను అట్లీ తెరకెక్కించనున్నాడని అంటున్నారు.