హ్యాపీ బర్త్ డే బాలకృష్ణ: ఆయన కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాలు
బాలకృష్ణ అన్న పేరు చెప్పగానే అభిమానుల మదిలో ఒక సౌండ్ వినిపిస్తుంది. అదే జై బాలయ్య. వయసు పెరుగుతుంటే క్రేజ్ పెరగడం కొద్దిమందిలోనే జరుగుతుంటుంది. అది బాలకృష్ణ విషయంలో వందశాతం నిజమయ్యింది. ఈరోజు ఆయన పుట్టినరోజు, ఈ సందర్భంగా బాలకృష్ణ కెరీర్లో గుర్తుండిపోయే సినిమాల గురించి మాట్లాడుకుందాం. ఆయన కెరీర్లో గుర్తుండిపోయే సినిమాలు చాలా ఉన్నాయి. అందులోంచి కొన్నింటిని ఇక్కడ చర్చిద్దాం. ఆదిత్య 369(1991): తెలుగులో తెరకెక్కిన మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ చిత్రంగా ఈ సినిమాను చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో కనిపించారు. శ్రీకృష్ణ దేవరాయలుగా బాలకృష్ణ నటన అందరినీ ఆకట్టుకుంది.అప్పట్లో ఈ సినిమా పెద్ద సంచలనాన్ని సృష్టించింది.
గుర్తుండిపోయే జానపద చిత్రం
భైరవ ద్వీపం(1994): ఈ సినిమాను కూడా సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించారు. తెలుగు వెండితెర మీద జానపద సినిమాలు కనిపించని సమయంలో వచ్చిన ఈ సినిమా, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే స్థానం సంపాదించుకుంది. సమరసింహా రెడ్డి(1999): బీ గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 6కోట్ల బడ్జెట్ తో రూపొంది 20కోట్ల వసూళ్ళను సంపాదించింది. నరసింహ నాయుడు(2001): బీ గోపాల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కూడా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. 30కోట్ల వసూళ్ళు పొందిన మొదటి చిత్రంగా చరిత్ర సృష్టించింది.
రాముడిగా బాలయ్య నటించిన చిత్రం
శ్రీరామరాజ్యం(2011) రాముడిగా బాలకృష్ణ నటించిన ఈ చిత్రాన్ని బాపు డైరెక్ట్ చేసారు. ఈ సినిమాలో సీతగా నయనతార అందరినీ మెప్పించింది. బాలకృష్ణ కెరీర్లో ఈ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సింహా(2010) వరుస ఫ్లాపులతో సతమవుతున్న బాలయ్యకు సింహా సినిమా మంచి విజయాన్ని అందించింది. ఈ సినిమాతోనే బాలయ్య, బోయపాటి కాంబినేషన్ మొదలైంది. వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటి వరకు లెజెండ్, అఖండ చిత్రాలు రిలీజై మంచి విజయాలను సాధించాయి. గౌతమి పుత్ర శాతకర్ణి(2017) శాతావహన రాజు గౌతమీ పుత్ర శాతకర్ణి పాత్రలో బాలయ్య నటించిన ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించారు. బాక్సాఫీసు వద్ద ఈ సినిమాకు మంచి విజయం దక్కింది.