Happy Birthday Puri Jagannath: తెలుగు సినిమా హీరోకు ఆటిట్యూడ్ నేర్పిన దర్శకుడు
పూరీ జగన్నాథ్.. మాస్ సినిమాలకు సరికొత్త అర్థాన్ని తీసుకొచ్చిన దర్శకుడు. తెలుగు సినిమా హీరోకు ఆటిట్యూడ్ నేర్పిన డైరెక్టర్. హీరో అంటే ఇలానే ఉండాలన్న సాంప్రదాయాన్ని బద్దలు కొట్టిన ఫిల్మ్ మేకర్. కేవలం డైలాగులతో సినిమాను నడిపించిన ఏకైన దర్శకుడు. స్టార్ హీరోలతో సైతం తక్కువ టైమ్ లో సినిమాలు తీసి బ్లాక్ బస్టర్లు అందించిన ఘనుడాయన. పవన్ కళ్యాణ్ హీరోగా బద్రి సినిమాతో దర్శకుడిగా మారాడు పూరీ జగన్నాథ్. ఆ సినిమాలోని, నువ్వు నందా అయితే, నేను బద్రీ.. బద్రీనాథ్ అనే డైలాగ్ ఎంత ఫేమస్సో చెప్పాల్సిన పనిలేదు.
జనాల నోళ్ళలో నానే పండగ చేస్కో డైలాగ్
సాధారణంగా జనాల నోళ్ళలోంచి ఎక్కువగా బయటకొచ్చే డైలాగులు సినిమాల్లో వినిపిస్తుంటాయి. కానీ పూరీ జగన్నాథ్ సినిమా రిలీజైన తర్వాత ఆ సినిమాలోని డైలాగులు జనాల నోళ్ళలో నానుతుంటాయి. ఉదాహరణకు పోకిరి సినిమాలోని పండగ చేస్కో డైలాగ్, ఇప్పటికీ జనాలు వాడుతుంటారు. పూరీ జగన్నాథ్ మాస్ మంత్రం: మాస్ సినిమాలకు పూరీ జగన్నాథ్ సినిమాలు సరికొత్త అర్థాన్ని చెబుతాయి. ఆయన సినిమాలు హీరో ఆధారంగా సాగుతాయి. అలా అని మహిళా పాత్రలకు ప్రాధాన్యం ఉండదా అంటే అదీ కాదు. పోకిరి సినిమాలో హీరోయిన్ ఇలియానా పాత్రకు ఎంత స్కోప్ ఉంటుందో అందరికీ తెలిసిందే.
తెలుగు సినిమా హీరోలను మాస్ హీరోలుగా మార్చిన దర్శకుడు
ప్రస్తుతం ఇండస్ట్రీలో మాస్ హీరోలుగా కొనసాగుతున్న చాలామంది హీరోలు, పూరీ జగన్నాథ్ తో పనిచేసినవారే. పూరీ జగన్నాథ్ తో పని చేయడానికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఆరు నెలలు వెయిట్ చేసాడంటే, ఆయన కెపాసిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే, ఒకప్పుడు వెలుగు వెలిగిన పూరీ జగన్నాథ్, ప్రస్తుతం విజయం కోసం ఎంతగానో పరితపిస్తున్నాడు. బద్రి నుండి లైగర్ వరకు మొత్తం 34సినిమాలకు పనిచేసాడు పూరీ. ఈతరం దర్శకులలో 30ప్లస్ సినిమాలను చేరుకున్నది పూరీ జగన్నాథ్ మాత్రమే. గత కొంతకాలంగా పూరీ జగన్నాథ్ సినిమాల్లో ఫిలాసఫీ ఎక్కువగా కనిపిస్తోంది. నేనింతే సినిమా నుండి ఇది మొదలైంది. ఈ సినిమాలోని డైలాగులకు ఉత్తమ మాటల రచయితగా అవార్డు అందుకున్నారు.
బిజినెస్ మేన్ సినిమాతో పీక్స్ లోకి వెళ్ళిపోయిన ఫిలాసఫీ
నేనింతే నుండి మొదలైన ఫిలాసఫీ డైలాగులు బిజినెస్ మేన్ తో పీక్స్ కి వెళ్ళిపోయింది. బిజినెస్ మేన్ సినిమాలో మహేష్ బాబు నుండి వచ్చే ప్రతీ డైలాగ్ ఫిలాసఫీని కూడుకుని ఉంటుంది. కెమెరామెన్ గంగతో రాంబాబు, టెంపర్, ఇజం సినిమాల్లోనూ ఫిలాసఫీ ఆనవాళ్ళు కనిపిస్తాయి. ఇస్మార్ట్ శంకర్, లైగర్ సినిమాల్లో ఫిలాసఫీ డైలాగ్స్ పెద్దగా కనిపించవు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా డబుల్నిస్మార్ట్ రూపొందుతోంది. పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్న ఈ సినిమా విడుదల తేదీని 2024 మార్చ్ 8గా ఫిక్స్ చేసారు. ఈ సినిమాతో పూరీ జగన్నాథ్ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని కోరుకుందాం.