Happy Birthday Rajamouli: బాహుబలితో ఇండియాను, ఆర్ఆర్ఆర్ తో ప్రపంచాన్ని గెలిచిన దర్శకుడు
రాజమౌళి.. తెలుగు సినిమా స్థాయి 100కోట్లు కూడా లేని రోజుల్లో 500కోట్లతో బాహుబలి సినిమాను తెరకెక్కించి రెండు వేల కోట్లకు పైగా వసూళ్లు సాధించిన దర్శక ధీరుడు. ఒకదాన్ని మించి మరొక హిట్టుతో హిట్టు మీద హిట్టు కొడుతూ తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనుడు రాజమౌళి. అందని ద్రాక్షలా ఊరించిన ఆస్కార్ అవార్డును ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటతో ఇండియాకు తీసుకొచ్చిన దర్శకుడాయన. రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అక్టోబర్ 10వ తేదీన ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన కెరీర్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం.
సీరియల్స్ తో ప్రారంభమైన రాజమౌళి కెరీర్
దర్శకుడు రాజమౌళి మొదటగా సీరియల్స్ తో ఎంట్రీ ఇచ్చారు. శాంతి నివాసం సీరియల్ ని రాజమౌళి డైరెక్ట్ చేశారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ తో సింహాద్రి సినిమాను రాజమౌళి రూపొందించాడు. ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఆ తర్వాత సై, చత్రపతి, విక్రమార్కుడు సినిమాలు బంపర్ హిట్ గా నిలిచాయి. యమదొంగ సినిమాతో రాజమౌళి సినిమాల్లో గ్రాఫిక్స్ పాళ్లు పెరిగాయి. యమదొంగ సినిమాలో నరకాన్ని చాలా అందంగా చూపించాడు రాజమౌళి.
ఈగతో రాజమౌళి ప్రయోగం
యమదొంగ తర్వాత రామ్ చరణ్ తేజ్ హీరోగా మగధీర సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత సునీల్ తో మర్యాద రామన్న సినిమాను రూపొందించి మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాతే ఈగ సినిమా రిలీజ్ అయింది. ఈగ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సినిమా క్లైమాక్స్ లో ఈగ చనిపోతుంటే అందరి కళ్ళలోంచి నీళ్లు వచ్చేసాయంటే కథ చెప్పడంలో రాజమౌళి ఎంతటి ప్రతిభావంతుడో అర్ధం చేసుకోవచ్చు. ఈగ తర్వాత బాహుబలి ఫ్రాంచైజీ, ఆర్ఆర్ఆర్ చిత్రాలు వచ్చాయి. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా ప్యాన్ వరల్డ్ రేంజ్ లో సరికొత్త సినిమాను తీసుకొచ్చే పనిలో ఉన్నాడు రాజమౌళి.