Happy Birthday Suman: తమిళం నుండి వచ్చి తెలుగులో టాప్ హీరోగా ఎదిగిన సుమన్ కెరీర్లోని ఆసక్తికర విషయాలు
ఈ వార్తాకథనం ఏంటి
సీనియర్ హీరో సుమన్ ఈరోజు తన 64వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. తెలుగు, తమిళం భాషల్లో హీరోగా ఎంతో పేరు సంపాదించుకున్న సుమన్, అనుకోని కారణాల వల్ల వివాదాల్లో ఇరుక్కున్నారు.
ఆ తర్వాత దాని నుండి బయటకు వచ్చి మళ్ళీ సినిమాల్లో బిజీగా మారిపోయారు. 1980, 90లలో హీరోగా తెలుగులో బిజీగా గడిపిన సుమన్, దేవుళ్ళ పాత్రలో చక్కగా ఒదిగిపోయేవారు.
అన్నమయ్య సినిమాలో శ్రీ వేంకటేశ్వర స్వామిగా సుమన్ నటన అందరినీ ఆకట్టుకుంది. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా సుమన్ కెరీర్లోని ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం.
1979లో నీచల్ కులం అనే తమిళ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి సుమన్ అడుగుపెట్టారు. ఆ తర్వాత 1982లో ఇద్దరు కిలాడీలు సినిమాతో తెలుగు సినిమాకు వచ్చారు.
Details
నంది అవార్డు అందుకున్న సుమన్
తెలుగులో తరంగిణీ, అపరాధి,నేటి భారతం, నవోదయం, సితార ఇలా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చారు. ఇప్పటివరకు దాదాపు 10భాషల్లో 700కు పైగా సినిమాల్లో సుమన్ నటించారు.
ఒకానొక కేసులో ఇరుక్కున్న సుమన్, దాని నుండి బయటకు వచ్చాక తెలుగు సినిమా రచయిత డివి నరసరాజు మనవరాలు శిరీషను పెళ్ళి చేసుకున్నారు. వీరిద్దరికీ ఒక కూతురు ఉంది.
హీరోగా ఒక వెలుగు వెలిగిన సుమన్, సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి శివాజీ సినిమాతో విలన్ గా పరిచయం అయ్యాడు. 2007లో రిలీజైన ఈ సినిమా సుమన్ కి మంచి పేరు తీసుకొచ్చింది.
1993లో రిలీజైన బావ బామ్మర్ది సినిమాకు గాను సుమన్ నంది అవార్డును, అలాగే 2009లో ఆసియానెట్ స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకున్నారు.
Details
దేవుడి పాత్రలో సుమన్ కనిపించిన సినిమాలు
దేవుడి పాత్రలో సుమన్ కనిపించిన సినిమాలు చాలా ప్రత్యేకమని చెప్పాలి. అన్నమయ్య సినిమాలో వేంకటేశ్వర స్వామిగా నటించారు. ఆ సినిమాను రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ముందు కూర్చుని చూసారట. ఆ అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని సుమన్ చెప్పుకొచ్చారు.
దేవుళ్ళు సినిమాలో రాముడిగా సుమన్ కనిపించారు. ఈ పాత్ర ఉండేది కొద్దిసేపే అయినా అందరినీ ఆకట్టుకుంది. రాముడిగా భక్త రామదాసు అనే సీరియల్ లోనూ సుమన్ కనిపించారు. ఇంకా శివుడిగానూ సుమన్ కనిపించారు.
ఇప్పటికీ సుమన్ నటిస్తూనే ఉన్నారు. రీసెంట్ గా ఆయన నటించిన తెలుగు చిత్రం నచ్చింది గర్ల్ ఫ్రెండూ విడుదలైంది.