పుట్టినరోజు జరుపుకుంటున్న మిల్కీ బ్యూటీ తమన్నా
2005లో 'శ్రీ' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది తమన్నా. ఆ తర్వాత వచ్చిన 'హ్యాపీ డేస్' సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న తర్వాత 'కాళీదాసు' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. 2006లో 'కేడి' సినిమాతో కోలీవుడ్ లో అడుగుపెట్టిన తమన్నా అక్కడ కార్తీ లాంటి హీరోలతో చేసిన సినిమాలతో హిట్స్ సంపాదించారు. 32ఏళ్ల ఈ భామ 2005 నుండి ఇప్పటివరకు 1 కన్నడ సినిమా, 1 మలయాళ సినిమాతో పాటు హిందీ, తెలుగు, తమిళం లో దాదాపు 65 సినిమాలు చేశారు. ఈ ముంబై భామ మొదట హిందీ సినిమాతో నటన ప్రారంభించినా, ఆమెకు ఎక్కువ పేరు తెచ్చింది మాత్రం తెలుగు సినిమాలు.
స్కూల్ ఈవెంట్ తెచ్చిన అవకాశం స్టార్ హీరోయిన్ ను చేసింది
ఆమె కెరీర్ లో 'బాహుబలి' లాంటి భారీ హిట్స్ తో పాటు 'హిమ్మత్ వాలా', 'హమ్ షకల్స్' లాంటి డిజాస్టర్లు ఉన్నాయి. నితిన్ తో చేసిన 'మాస్ట్రో', పవన్ కళ్యాణ్ తో చేసిన 'గంగతో రాంబాబు', ఎన్టీఆర్ తో చేసిన 'ఊసరవెల్లి', మెగాస్టార్ తో చేసిన 'సైరా' సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించారు. వజ్రాల వ్యాపారం చేసే కుటుంబానికి చెందిన తమన్నా 13 ఏళ్ల వయసులో తన స్కూల్ లో జరుగుతున్న ఒక ఈవెంట్ లో పాల్గొన్నప్పుడు తనకు మొదటి సినిమా 'చాంద్ సా రోహన్ చెహ్రా'లో అవకాశం వచ్చిందని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకున్నారు. ఫాంటా, చంద్రికా ఆయుర్వేదిక్ సోప్ వంటి కమర్షియల్ బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు తమన్నా.