
Hari Hara VeeraMallu: 'హరి హర వీరమల్లు' ఓటీటీ క్లైమాక్స్‌లో కీలక మార్పులు!
ఈ వార్తాకథనం ఏంటి
పవన్ కళ్యాణ్ తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'హరిహర వీరమల్లు' (Hari Hara VeeraMallu) ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. క్రిష్, జ్యోతికృష్ణ సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ చారిత్రక చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon Prime Video) స్ట్రీమింగ్ అవుతోంది. అయితే థియేటర్లలో చూపించిన వెర్షన్ కాకుండా, ఓటీటీలో కొన్ని సవరణలతో కూడిన వెర్షన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినట్లు సమాచారం. ఈ సినిమా థియేటర్లలో విడుదలైన సమయంలోనే కొన్ని సన్నివేశాలపై విమర్శలు వినిపించాయి. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ పనితీరుపై కొంతమంది నిరాశ వ్యక్తం చేశారు. ఆ విమర్శలను పరిగణనలోకి తీసుకున్న చిత్రబృందం, ఓటీటీలో రిలీజ్ చేసే ముందు కొన్ని సన్నివేశాలను తొలగించినట్లు తెలుస్తోంది.
వివరాలు
బాబీడియోల్ పాత్రకు సంబంధించి డైలాగులు,యాక్షన్ సన్నివేశాలు తొలగింపు
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గుర్రపు స్వారీ సన్నివేశం, ఆయన బాణం సంధించే సీక్వెన్సులు థియేటర్‌లో చూపించిన తర్వాత, ఇప్పుడు ఆ సన్నివేశాలను ఓటీటీ వెర్షన్‌లో తొలగించినట్లు సమాచారం. ఇక క్లైమాక్స్‌లోనూ కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. అసుర హననం పాట ముగిసిన తరువాత పార్ట్-2 ప్రకటిస్తూ సినిమాను ముగించేలా ఎడిటింగ్ చేసినట్లు సమాచారం. అంతేకాదు, బాబీడియోల్ పాత్రకు సంబంధించిన కొన్నిరకాల డైలాగులు, యాక్షన్ సన్నివేశాలు కూడా తొలగించినట్లు సమాచారం. మొత్తంగా సుమారు 15 నిమిషాల ఫుటేజ్‌ను కత్తిరించి, ఓటీటీ వెర్షన్‌లో అందుబాటులోకి తెచ్చినట్లు టాక్ .
వివరాలు
విడుదలైన నాలుగు వారాలకే..
గత జూలై 24న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా, పవన్ కళ్యాణ్ వన్‌మ్యాన్ షోగా అభిమానులను ఉర్రూతలూగించింది. విడుదలైన నాలుగు వారాలకే అకస్మాత్తుగా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ మొదలైంది. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రెండో పార్ట్ షూటింగ్‌లో భాగంగా కొంతభాగం ఇప్పటికే పూర్తయినట్టు సమాచారం.