Nikhil: హాలీవుడ్ సూపర్ హీరోకి టాలీవుడ్ టచ్.. 'హీ-మ్యాన్'గా నిఖిల్ సూపర్ ఎంట్రీ!
ఈ వార్తాకథనం ఏంటి
హాలీవుడ్‌లో అత్యంత గుర్తింపు పొందిన ఫాంటసీ యాక్షన్ చిత్రాల్లో ఒకటైన 'హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్' త్వరలో భారతీయ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఆంగ్ల ప్రచార చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా విశేష స్పందన లభించగా, తాజాగా విడుదల చేసిన తెలుగు ప్రచార చిత్రం తెలుగు సినీ అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచింది. అయితే హాలీవుడ్ సూపర్ హీరో చిత్రాలకు తెలుగులో టాలీవుడ్ స్టార్స్ వాయిస్ ఓవర్ ఇస్తే ఆ ఇంపాక్ట్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు అదే ప్రత్యేకత 'హీ-మ్యాన్' చిత్రంలో కనిపించబోతోంది. ఈ చిత్రంలోని ప్రధాన వీరుడు 'హీ-మ్యాన్' పాత్రకు యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ తన స్వరాన్ని అందించారు.
వివరాలు
'డంకన్' పాత్రకు నటుడు రావు రమేష్ స్వరం
'కార్తికేయ-2' విజయంతో మంచి గుర్తింపు పొందిన నిఖిల్ వాయిస్ ఈ పాత్రకు మరింత బలం తీసుకొచ్చిందని ప్రచార చిత్రం చూసిన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ప్రధాన పాత్రలతో పాటు ఇతర కీలక పాత్రలకు కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటుల స్వరాలను వినిపించనున్నారు. హాలీవుడ్ రూపంలో జారెడ్ లెటో పోషించిన క్రూరమైన ప్రతినాయకుడి పాత్రకు ప్రముఖ నటుడు ఆదిత్య మీనన్ గంభీర స్వరాన్ని అందించారు. అలాగే కథలో ప్రధాన పాత్రగా నిలిచే 'డంకన్' పాత్రకు నటుడు రావు రమేష్ స్వరం వినిపించనుంది. ఆయన చెప్పిన మాటలు ఈ పాత్రకు మరింత ప్రభావాన్ని తెచ్చినట్లు తెలుస్తోంది.
వివరాలు
వచ్చే నెల 5వ తేదీన 5బాషలలో చిత్రం విడుదల
'ఎటెర్నియా' అనే ఊహాజనిత ప్రపంచం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో భారీ యుద్ధ సన్నివేశాలు, భావోద్వేగాలు, అద్భుత దృశ్యాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. అమెజాన్ ఎంజీఎం సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి ట్రావిస్ నైట్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం వచ్చే నెల 5వ తేదీన ఆంగ్లంతో పాటు తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.