త్రిష బర్త్ డే: ఇరవై ఏళ్ళుగా హీరోయిన్ గా కొనసాగుతున్న స్టార్
సాధారణంగా హీరోయిన్లకు షార్ట్ కెరీర్ ఉంటుంది. కొత్తగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వగానే హిట్టు పడితే వరుసగా అవకాశాలు వచ్చేస్తుంటాయి. ఆ తర్వాత ఫ్లాపులు రాగానే అవకాశాలు తగ్గిపోయి కనుమరుగై పోతుంటారు. కానీ అందాల భామ త్రిష సంగతే వేరు. ఈరోజు త్రిష పుట్టినరోజు. సినిమా ఇండస్ట్రీలోకి త్రిష ఎంటరై ఇప్పటికి 20సంవత్సరాలకు పైగానే అయ్యింది. అయినా కూడా హీరోయిన్ గా అవకాశాలు తెచ్చుకుంటోంది. మొదటగా 1999 జోడీ అనే తమిళ సినిమాతో సినిమాల్లోకి ప్రవేశించింది త్రిష. అందులో మెయిన్ హీరోయిన్ గా సిమ్రాన్ కనిపించింది, సైడ్ క్యారెక్టర్ లో త్రిష నటించింది. ఇంతకీ ఇంత లాంగ్ కెరీర్ ఉండడానికి కారణాలేంటో ఇక్కడ చూద్దాం.
రెగ్యులర్ హీరోయిన్ నుండి వేరుపడిన త్రిష
హీరోయిన్లంటే పాటల్లో డాన్సులు వేయడం మాత్రమే అనుకునే వారికి త్రిష కెరీర్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. తెలుగులో ఆమె నటించిన వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, పౌర్ణమి, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే మొదలగు చిత్రాల్లో ఆమె చేసిన పాత్రలు తన నటనలోని వేరు వేరు కోణాల్ని మనకు చూపిస్తాయి. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాదు, కోడి(తమిళం) విలన్ గా నటించి మెప్పించింది. రెగ్యులర్ గా హీరోయిన్ అనగానే గుర్తొచ్చే ఆలోచన నుండి త్రిష ఎప్పుడో వేరు పడింది. అందుకే ఆమెకు 96సినిమా వచ్చింది. త్రిష, సినిమాలు రావట్లేదేంటి అనుకుంటున్న సమయంలో వచ్చిన 96మూవీ, క్లాసిక్ గా నిలిచిపోయింది. కెరీర్లో వైవిధ్యమైన పాత్రలు ఎన్నో ఉన్నాయి కాబట్టి హీరోయిన్ గా కొనసాగుతోంది త్రిష.