Homebound: ఆస్కార్ ఆశలపై నీలి నీడలు?.. 'హోమ్‌బౌండ్'పై కాపీ వివాదం
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ తరఫున 2026 ఆస్కార్ బరిలో నిలిచిన 'హోమ్‌బౌండ్' సినిమా ఇప్పుడు వివాదానికి కేంద్రబిందువుగా మారింది. ఈ చిత్రాన్ని తన నవల ఆధారంగా అనుమతి లేకుండా రూపొందించారంటూ రచయిత్రి పూజా చంగోయివాలా సంచలన ఆరోపణలు చేయడంతో విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంపై దర్శక-నిర్మాతలపై న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు ఆమె వెల్లడించారు. తాను 2021లోనే'హోమ్‌బౌండ్'అనే పేరుతో ఒక నవల రాసినట్లు పూజా తెలిపారు. సినిమా టైటిల్ నుంచి కథలోని పాత్రల స్వభావం వరకు అన్నీ తన నవలతో పోలి ఉన్నాయని ఆమె ఆరోపించారు. ఈ అంశంపై అక్టోబర్ 15న నిర్మాణ సంస్థకు లీగల్ నోటీసులు పంపించినా,వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని చెప్పారు. అందుకే ఇప్పుడు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు.
వివరాలు
చట్టపరంగా సమాధానమిస్తామన్న టీమ్
ఈ ఆరోపణలపై చిత్ర నిర్మాణ సంస్థ తాజాగా స్పందించింది. ''ఈ అంశంపై మేము చట్టపరంగా సమాధానం ఇస్తాం. ప్రస్తుతం దీనిపై వ్యాఖ్యానించలేం'' అని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, ఈ ఏడాది మే నెలలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'హోమ్‌బౌండ్' ప్రదర్శన అనంతరం చిత్రబృందం ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయం వెల్లడించింది. 2020లో న్యూయార్క్ టైమ్స్‌లో ప్రచురితమైన ఒక కథనం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు అప్పట్లో వారు చెప్పారు. నీరజ్ ఘైవాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, ఈ ఏడాది కేన్స్‌కు ఎంపికైన ఏకైక భారతీయ చిత్రంగా గుర్తింపు పొందింది.
వివరాలు
టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో రెండో రన్నరప్‌గా..
అంతేకాదు, టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఇంటర్నేషనల్ పీపుల్స్ ఛాయిస్ అవార్డులో రెండో రన్నరప్‌గా నిలిచింది. వచ్చే ఏడాది జరగనున్న ఆస్కార్ అవార్డుల కోసం విడుదల చేసిన తాజా షార్ట్‌లిస్ట్‌లోనూ ఈ సినిమాకు చోటు దక్కింది. పోలీస్ కావాలనే తమ కలను నెరవేర్చుకునే క్రమంలో కుల, మత వివక్షను ఎదుర్కొంటూ ఇద్దరు స్నేహితులు చేసే పోరాటమే ఈ సినిమా ప్రధాన కథాంశం. నీరజ్ ఘైవాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.