Homebound: ఆస్కార్ రేసు నుంచి 'హోమ్‌బౌండ్' ఔట్.. జాన్వీ కపూర్ చిత్రానికి నిరాశ
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్కార్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీపై ఆశలు పెట్టుకున్న ఇండియన్ మూవీ అభిమానులకు ఈసారి నిరాశే మిగిలింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ గురువారం (జనవరి 22) అధికారిక నామినేషన్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ తరపున అధికారికంగా పంపిన 'హోమ్‌బౌండ్' సినిమాకు చోటు దక్కలేదు. ఇండియా నుంచి ఆస్కార్ రేసులో నిలిచిన 'హోమ్‌బౌండ్' తుది నామినేషన్ల జాబితాలోకి చేరలేకపోయింది. అయితే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన సినిమాలు ఈ ప్రతిష్టాత్మక కేటగిరీలో స్థానం సంపాదించుకున్నాయి.
Details
నామినేషన్లకు ఎంపికైన చిత్రాలివే
అర్జెంటీనా నుంచి 'బెలెన్', బ్రెజిల్ నుంచి 'ది సీక్రెట్ ఏజెంట్', ఫ్రాన్స్ నుంచి 'ఇట్‌వాజ్ జస్ట్ యాన్ యాక్సిడెంట్', జర్మనీ నుంచి 'సౌండ్ ఆఫ్ ఫాలింగ్', ఇరాక్ నుంచి'ది ప్రెసిడెంట్స్ కేక్' చిత్రాలు నామినేషన్లకు ఎంపికయ్యాయి. అలాగే జపాన్ నుంచి 'కోకుహో', జోర్డాన్ నుంచి 'ఆల్ దట్ లెఫ్ట్ ఆఫ్ యూ',నార్వే నుంచి 'సెంటిమెంటల్ వాల్యూ', పాలస్తీనా నుంచి 'పాలస్తీనా 36', దక్షిణ కొరియా నుంచి 'నో అదర్ ఛాయిస్' సినిమాలు కూడా తుది జాబితాలో చోటు దక్కించుకున్నాయి. వీటితో పాటు స్పెయిన్ నుంచి 'సిరత్', స్విట్జర్లాండ్ నుంచి 'లేట్ షిఫ్ట్', తైవాన్ నుంచి'లెఫ్ట్ హ్యాండెడ్ గర్ల్', ట్యూనీషియా నుంచి 'ది వాయిస్ ఆఫ్ హింద్ రజబ్' చిత్రాలు కూడా నామినేషన్లలో నిలిచాయి.
Details
'హోమ్‌బౌండ్' సినిమా నేపథ్యం
నీరజ్ ఘైవాన్ దర్శకత్వం వహించిన 'హోమ్‌బౌండ్' చిత్రం గత ఏడాది సెప్టెంబర్ 26న భారతదేశంలో విడుదలైంది. ఈ సినిమాలో ఇషాన్ ఖట్టర్, విశాల్ జేత్వా, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో దేశంలోని సాధారణ ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను ఈ చిత్రంలో హృదయస్పర్శిగా చూపించారు. అంతర్జాతీయంగా ఈ సినిమాకు మంచి స్పందన లభించినప్పటికీ, భారతీయ థియేటర్లలో మాత్రం పెద్దగా ఆడలేకపోయింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
Details
ఆస్కార్ ప్రచారానికి భారీ ఖర్చు: కరణ్ జోహార్
'హోమ్‌బౌండ్' చిత్రాన్ని కరణ్ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించింది.ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కరణ్ జోహార్ ఆస్కార్ ప్రచారానికి అయ్యే ఖర్చుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆస్కార్ ప్రచారానికి భారీగా ఖర్చు అవుతుందని తన వ్యాపార భాగస్వామి అదార్ పూనావాలాతో ముందుగానే చెప్పినట్లు ఆయన వెల్లడించారు. "మేము 'హోమ్‌బౌండ్' సినిమా చేస్తున్న సమయంలో ఆస్కార్ ప్రచారానికి చాలా డబ్బు ఖర్చవుతుందని అదార్‌కు చెప్పాను.కొన్నిసార్లు అది ఎంత ఖర్చు పెట్టినా తరగని అగాధంలా మారుతుంది. ఎందుకంటే ఫలితం ఏంటో ముందుగా తెలియదు.కనీసం షార్ట్‌లిస్ట్ చేసిన 15సినిమాల్లోకి లేదా చివరి ఐదు సినిమాల్లోకి వెళ్తామో లేదో కూడా మనకు స్పష్టత ఉండదు. ఇది నిజంగా చాలా కష్టమైన ప్రక్రియ అని కరణ్ జోహార్ వివరించారు.