Faria Abdullah: నేను ఒరిజినల్ ముస్లింను కాదు.. కుటుంబ నేపథ్యంపై ఫరియా అబ్దుల్లా షాకింగ్ కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో తన నటనతో పాటు సహజమైన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్న అందాల చిన్నది ఫరియా అబ్దుల్లా. తొలి సినిమాతోనే 'చిట్టి'గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫరియా, 'జాతిరత్నాలు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫరియా అబ్దుల్లా తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను వెల్లడించారు. స్టేజ్ ఆర్టిస్టుగా, పెయింటర్‌గా, సింగర్‌గా, డ్యాన్సర్‌గా అన్ని రంగాల్లో ప్రయత్నించడంతో ఒక దశలో గందరగోళానికి గురయ్యానని ఫరియా తెలిపారు. అయితే ఈ ప్రయాణం తనకు ఎంతో నేర్పించిందని చెప్పారు. తనకు రచన అంటే చాలా ఇష్టమని, తాను పాడే పాటలకు చాలాసార్లు తానే సాహిత్యం అందిస్తానని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలుగు రాయడం కూడా నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నానని వెల్లడించారు.
Details
తల్లిదండ్రులు ఎప్పుడూ ప్రోత్సహిస్తు ఉంటారు
చిన్నతనం నుంచే కళల పట్ల తనకు ఉన్న ఆసక్తిని తల్లిదండ్రులు ఎప్పుడూ ప్రోత్సహించారని ఫరియా తెలిపారు. సమ్మర్ క్యాంపులు, చిల్డ్రన్స్ థియేటర్ వర్క్‌షాప్‌ల ద్వారా కొత్త కళలను నేర్చుకునే అవకాశం లభించిందన్నారు. డ్యాన్స్‌తో ప్రారంభమైన తన ప్రయాణం కంటెంపరరీ, వెస్ట్రన్, హిప్-హాప్ వంటి అనేక శైలుల వరకు విస్తరించిందని చెప్పారు. డ్యాన్స్ కేవలం ఒక కళ మాత్రమే కాదని, అది ఒక జీవన విధానమని ఫరియా అభిప్రాయపడ్డారు.డ్యాన్స్ తర్వాత థియేటర్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఫరియా, అక్కడ సాహిత్యం, ఫైన్ ఆర్ట్స్ వంటి అంశాలను నేర్చుకున్నట్లు తెలిపారు. ఈ ప్రయాణంలో వివిధ రకాల కళాకారులు, స్క్రీన్‌ప్లే రచయితలు, కవులు, ఫోటోగ్రాఫర్లు, మోడలింగ్ రంగంలోని నిపుణులతో కలిసి పనిచేయడం వల్ల ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పారు.
Details
కృష్ణుడు నాకు రోల్ మోడల్
తన మత నేపథ్యం గురించి కూడా ఫరియా ఓపెన్‌గా మాట్లాడారు. తన తండ్రి సంజయ్ అబ్దుల్లా ఇస్లాం మతం పట్ల ఆకర్షితులై ఖురాన్‌ను చదివి, హిందూ నేపథ్యం నుంచి ఇస్లాంలోకి మారారని వెల్లడించారు. ఇంట్లో అన్ని పండుగలను జరుపుకుంటూ, అన్ని మతాల ఆచారాలను గౌరవిస్తూ తాను పెరిగానని ఫరియా తెలిపారు. తన తల్లి ముస్లిం నేపథ్యం కలిగి ఉన్నప్పటికీ, శివుడిని గురువుగా స్వీకరించారని, రుద్రాక్ష మాలను ధరిస్తూ శివుడికి నిత్యం పూజలు చేస్తారని చెప్పారు. ఆమె ఒక గొప్ప భక్తురాలిగా మారిందని వివరించారు. వ్యక్తిగతంగా కృష్ణుడు తనకు గొప్ప రోల్ మోడల్ అని, కష్ట సమయాల్లో ఆయనను ప్రార్థిస్తే ఎల్లప్పుడూ సహాయం అందుతుందనే నమ్మకం తనకుందని ఫరియా అన్నారు.