
Jackky Bhagnani: 'పారిపోలేదు.. నేను ఇక్కడే ఉన్నాను'.. దివాలా వార్తలపై స్పందించిన జాకీ భగ్నానీ!
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'బడే మియా.. ఛోటే మియా' ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి ఆశించిన స్పందన రాలేదు. దీంతో ఈ సినిమాను నిర్మించిన నిర్మాత జాకీ భగ్నానీ, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ భర్త ఆర్థికంగా కుదేలయ్యారని, దివాలా తీశారని వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో తాజాగా జాకీ భగ్నానీ స్పందిస్తూ, తన దివాలా వార్తలపై వివరణ ఇచ్చారు. ఈ సినిమా కోసం తాను జూహులో ఉన్న తన కార్యాలయాన్ని తనఖా పెట్టిన విషయం నిజమే. అయితే ఇప్పుడు అదే భవనాన్ని తిరిగి తన సొంతం చేసుకున్నానని ఆయన తెలిపారు.
Details
అవాస్తవాలను ప్రచారం చేయొద్దు
మీడియా కథనాల్లో వచ్చినట్టుగా, తాను దివాలా తీయడం వల్ల ఆ ఆస్తిని అమ్మేశానని, తన వద్ద ఆహారం కొనుగోలు చేయడానికి డబ్బు లేకపోయిందని, తాను దేశం వదిలి పారిపోయానని ప్రచారం చేయడంపై ఆయన స్పందించారు. 'ఇలాంటి రూమర్ల విషయంలో నేను ఎవరినీ నిందించలేను. అసలు ఈ వార్తలు ఎక్కడి నుంచి మొదలయ్యాయో కూడా నాకు తెలియదని జాకీ అన్నారు. అంతేకాకుండా 'బడే మియా.. ఛోటే మియా' విషయంలో దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్‌కు అవకాశం ఇచ్చిన విషయంలో తాను పొరపాటు చేశానని కూడా ఆయన స్వయంగా పేర్కొన్నారు.
Details
రూ.102 కోట్ల వసూళ్లకే పరిమితం
ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ యాక్షన్ నేపథ్యంతో రూపొందించారు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, మానుషి చిల్లర్, అలయ ఎఫ్, సోనాక్షి సిన్హా వంటి నటీనటులు కీలక పాత్రల్లో కనిపించారు. దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.102 కోట్ల వసూళ్లకే పరిమితమైంది. ఇక ఈ సినిమాకు సంబంధించి గతంలోనే జాకీ భగ్నానీ మాట్లాడుతూ, దీనికోసం తాను పలు ఆస్తులను తనఖా పెట్టినట్లు వెల్లడించారు. అయితే ఈ ప్రయాణంలో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల గురించి చెబుతూ మా బాధ ఎవరికీ పట్టదంటూ వ్యాఖ్యానించారు.