LOADING...
Peddi: 'పెద్ది' కోసం ప్రాణం పెట్టా.. కానీ గుర్తింపు రావట్లేదు: జగపతిబాబు
'పెద్ది' కోసం ప్రాణం పెట్టా.. కానీ గుర్తింపు రావట్లేదు: జగపతిబాబు

Peddi: 'పెద్ది' కోసం ప్రాణం పెట్టా.. కానీ గుర్తింపు రావట్లేదు: జగపతిబాబు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 08, 2026
10:39 am

ఈ వార్తాకథనం ఏంటి

'పెద్ది' సినిమా కోసం తాను ఎంతో కష్టపడ్డానని, ఆ చిత్రంపై ప్రత్యేకమైన అనుబంధం ఉందని నటుడు జగపతిబాబు అన్నారు. మధ్యలో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ, తాను మాత్రం 'పెద్ది' విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూసినట్లు తెలిపారు. రూ.300 కోట్లు ఖర్చు చేసి సినిమా తీసినా, రూ.300 టికెట్ కొనుగోలు చేసి చూసే ప్రేక్షకుల చేతుల్లోనే సినిమా పరిశ్రమ భవిష్యత్తు ఉంటుందని వ్యాఖ్యానించారు. 'పెద్ది' విడుదల అనంతరం తన పాత్ర 'అప్పలసూరి' గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జగపతిబాబు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ''పెద్ది' విడుదలైన తర్వాత ఒక ప్రముఖ దర్శకుడు నాకు ఫోన్ చేశారు. 'మీరు సినిమాలో అద్భుతమైన పాత్ర చేశారు.

వివరాలు

వరుసగా 20 సినిమాల ఆఫర్లు వచ్చేవి

కానీ దానికి తగిన గుర్తింపు రావడం లేదు. ఇదే పాత్రను వేరే భాషకు చెందిన నటుడు చేసి ఉంటే భారీగా హైలైట్ చేసేవారు. వరుసగా 20 సినిమాల ఆఫర్లు కూడా వచ్చేవి. కానీ మిమ్మల్ని ఎందుకు ఎవరూ పట్టించుకోవడం లేదు?' అని అడిగారు'' అని జగపతిబాబు చెప్పారు. ఏ ఇండస్ట్రీలో అయినా పరభాషా నటులకు ఎక్కువ గౌరవం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ''నేను కన్నడలో సినిమా చేస్తే అక్కడ నన్ను ఎంతో గౌరవిస్తారు. 'పెద్ది' విడుదలైన తర్వాత నేను కూడా దర్శకుడు బుచ్చిబాబును ఒక ప్రశ్న అడిగాను. షూటింగ్ సమయంలో ప్రతి షాట్‌కు చప్పట్లు కొట్టారు. ఇప్పుడు నా పాత్ర గురించి ఎందుకు మాట్లాడడం లేదు? నన్ను మర్చిపోతున్నారా? అని అడిగానని తెలిపారు.

వివరాలు

గుర్తింపు కోరే హక్కు నాకు ఉంది

'పెద్ది' కోసం నేను ప్రాణం పెట్టి పనిచేశాను. అందుకే గుర్తింపు కోరే హక్కు నాకు ఉంది. మిగతా సినిమాల విషయంలో నేను ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు. 'పెద్ది'కి ఇంకా రావాల్సిన ఆదరణ మిగిలే ఉంది. కచ్చితంగా ఈ చిత్రానికి మరింత గుర్తింపు లభిస్తుంది. ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూసి గర్వపడతారని జగపతిబాబు పేర్కొన్నారు. ఇక సినిమాలో జాన్వీ కపూర్ పాత్రపై వచ్చిన విమర్శల గురించి స్పందించిన ఆయన, కళాకారులను వ్యక్తిగతంగా టార్గెట్ చేయవద్దని కోరారు. 'సినిమా విషయంలో నటీనటులను ట్రోల్ చేయకండి. పాపం జాన్వీ కపూర్ దర్శకుడు చెప్పిన విధంగానే నటించింది.

Advertisement

వివరాలు

ఆర్టిస్టులకు ట్రోల్ చేయొద్దు

కొన్ని సందర్భాల్లో పాత్రలు లేదా సన్నివేశాలు ఆశించిన విధంగా పని చేయకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో ఆర్టిస్టులను వ్యక్తిగతంగా విమర్శించడం సరైంది కాదు. ఈ విషయంలో నేను జాన్వీకి పూర్తిగా మద్దతుగా నిలుస్తాను. ఆమెను ట్రోల్ చేసి మానసికంగా ఇబ్బంది పెట్టొద్దు'' అని అన్నారు. కాగా, రామ్‌చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన 'పెద్ది' చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది. విడుదలైన తొలి మూడు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.236 కోట్ల వసూళ్లు సాధించింది.

Advertisement