Loading...
Im Game Movie Review telugu: 'ఐమ్‌ గేమ్‌'.. దుల్కర్‌ సల్మాన్‌ ఫాంటసీ థ్రిల్లర్‌ ఎలా ఉంది?
'ఐమ్‌ గేమ్‌'.. దుల్కర్‌ సల్మాన్‌ ఫాంటసీ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

Im Game Movie Review telugu: 'ఐమ్‌ గేమ్‌'.. దుల్కర్‌ సల్మాన్‌ ఫాంటసీ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 04, 2026
09:39 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌. ఆయన నటించిన సినిమాలు ఇటీవల వరుసగా తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. తాజాగా ఆయన నటించిన చిత్రం 'ఐమ్‌ గేమ్‌' (I'm Game). ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులకు ఎలాంటి వినోదాన్ని అందించింది?

వివరాలు

కథేంటంటే..

డ్యాన్‌ జాన్‌ (దుల్కర్‌ సల్మాన్‌) చదువు పూర్తయిన తర్వాత తండ్రి కోరిక మేరకు బిజినెస్‌ చేస్తుంటాడు.

అయితే, అతడికి వ్యాపారం కంటే గ్యాంబ్లింగ్‌పైనే ఎక్కువ ఆసక్తి. లక్షల రూపాయలు పోగొట్టుకున్నా.. అప్పులు చేసి మరీ జూదం ఆడుతుంటాడు.

ఈ క్రమంలో అప్పులిచ్చిన వారి చేతిలో దెబ్బలు తినడంతో డ్యాన్‌ తల్లి మెర్సీ (జయసుధ) తన దగ్గర దాచుకున్న రూ.60 లక్షలను అతడికి ఇస్తుంది.

అయితే ఆ డబ్బుతో డ్యాన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ ఆడి మొత్తం పోగొట్టుకుంటాడు. తన డబ్బును తిరిగి ఇవ్వాలంటూ బెట్టింగ్‌ నిర్వాహకులను బెదిరించి.. డబ్బు తీసుకుని కారులో అక్కడి నుంచి పారిపోతుంటాడు.

ఈ క్రమంలో జరిగిన ప్రమాదంలో డ్యాన్‌ తన కుడి చేయిని కోల్పోతాడు.

వివరాలు

మరింత ఆసక్తికరంగా కథ

దీంతో వైద్యులు అతడికి శస్త్రచికిత్స చేసి.. మరో వ్యక్తికి చెందిన చేయిని డ్యాన్‌కు అమరుస్తారు. ఈ సమయంలో అతడికి ఫిజియోథెరపిస్ట్‌ ఇషా (కయాదు లోహర్‌) పరిచయమవుతుంది.

అంతా సవ్యంగానే ఉందని అనుకుంటున్న సమయంలో డ్యాన్‌కు అసలు సమస్య ఎదురవుతుంది. అతడికి అమర్చిన కుడి చేయి డ్యాన్‌ నియంత్రణలో ఉండదు.

డ్యాన్‌ ఎంత ప్రయత్నించినా.. ఆ చేయి తనకు నచ్చినట్లు, తాను అనుకున్న పనులకు భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటుంది.

తొలుత ఈ పరిణామంతో భయపడిన డ్యాన్‌.. ఆ తర్వాత క్రమంగా తన కుడి చేయి చేసే పనులకు అలవాటు పడతాడు. ఒకరోజు ఓ బెట్టింగ్‌ సెంటర్‌కు వెళ్లి మద్యం సేవిస్తుండగా.. అక్కడికి డేవిడ్‌ (మిస్కిన్‌) వస్తాడు.

ADVERTISEMENT

వివరాలు 

ఎలా ఉందంటే..

డేవిడ్‌ను చూడగానే డ్యాన్‌ కుడి చేయి కత్తిని తీసుకుని అతడిని చంపేందుకు ప్రయత్నిస్తుంది.

అయితే, డ్యాన్‌ అతికష్టం మీద తన చేతిని అడ్డుకుంటాడు. అసలు డ్యాన్‌కు అమర్చిన కుడి చేయి ఎవరిది? దానికి అంతటి శక్తి ఎలా వచ్చింది?

డేవిడ్‌ను అది ఎందుకు చంపాలనుకుంటోంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

తమకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఆత్మలు కథానాయకులను ఆవహించడం, తప్పు చేసిన వారిని శిక్షించేందుకు మల్టిపుల్‌ పర్సనాలిటీ డిజార్డర్‌ వంటి అంశాలను ఉపయోగించడం వంటి కథలు ఇప్పటికే వెండితెరపై చాలానే వచ్చాయి.

ఇలాంటి కథల్లో లాజిక్‌ కంటే.. దర్శకుడు ఆ కాన్సెప్ట్‌ను ఎంత నమ్మశక్యంగా తెరపై చూపించాడన్నదే కీలకం.

ADVERTISEMENT

వివరాలు

దర్శకుడు ఎంచుకన్న పాయింట్ లో కొత్తదనం

ఆ విషయంలో 'ఐమ్‌ గేమ్‌' కోసం దర్శకుడు నహాస్‌ హిదయత్‌ ఎంచుకున్న పాయింట్‌ కొత్తగా అనిపిస్తుంది. ఆ పాయింట్‌ను వైవిధ్యంగా తెరపై ఆవిష్కరించడంలో దర్శకుడు చాలా వరకు విజయం సాధించాడు.

అయితే, ఇంత ఆసక్తికరమైన ఎలిమెంట్‌ను పూర్తిస్థాయిలో వినోదాత్మకంగా మలచలేకపోయారేమో అనే భావన సినిమా పూర్తయ్యాక కలుగుతుంది.

ప్రారంభంలోనే డ్యాన్‌ లైఫ్‌స్టైల్‌, అతడికి జూదంపై ఉన్న వ్యసనం, దొరికిన చోటల్లా అప్పులు చేయడం వంటి సన్నివేశాలతో అతడి పాత్ర స్వభావాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తారు.

తద్వారా ప్రేక్షకులను డ్యాన్‌ కథా ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు.

అయితే డ్యాన్‌కు సర్జరీ జరిగి.. అమర్చిన చేయి అతడి నియంత్రణలో లేదనే విషయం బయటపడే వరకు కథ, కథనం పెద్దగా కొత్తగా అనిపించవు.

వివరాలు

ద్వితీయార్ధంపై మరింత ఆసక్తి

కానీ ఈ ఎలిమెంట్‌ కథలోకి వచ్చిన తర్వాత సన్నివేశాలు ఒక్కసారిగా వినోదాత్మకంగా, థ్రిల్లింగ్‌గా మారతాయి.

డ్యాన్‌ మాట వినకుండా అతడి కుడి చేయి తనకు నచ్చిన పనులు చేయడం మంచి వినోదాన్ని పంచుతుంది.

ముఖ్యంగా డేవిడ్‌పై హత్యాయత్నం జరిగిన తర్వాత డ్యాన్‌ తీసుకునే నిర్ణయంతో కుడి చేయి తన విశ్వరూపాన్ని చూపిస్తుంది.

విరామానికి ముందు వచ్చే ఈ సన్నివేశం ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తిస్తుంది.

ముఖ్యంగా డ్యాన్‌, అతడి కుడి చేయి మధ్య జరిగే సంఘర్షణను దర్శకుడు తెరపై చూపించిన విధానం కొత్తగా అనిపిస్తుంది.

తన పగ తీర్చుకోవడానికి అవసరమైతే డ్యాన్‌ను సైతం చంపేందుకు సిద్ధమయ్యే కుడి చేయి చేసే హంగామాతో ఫస్ట్‌ హాఫ్‌ ముగుస్తుంది. దీంతో ద్వితీయార్ధంపై ఆసక్తి పెరుగుతుంది.

వివరాలు

ఫ్లాష్‌బ్యాక్‌ మొత్తం రొటీన్‌ డ్రామానే

డేవిడ్‌ను చంపేందుకు డ్యాన్‌ కుడి చేయి ప్రయత్నించడంతో.. అసలు ఆ చేయి వెనుక ఏదో బలమైన కథ ఉందని ప్రేక్షకుడు అంచనా వేస్తాడు.

ఆ చేయి ఎవరిదో డ్యాన్‌ తెలుసుకునే సన్నివేశాలతో సెకండ్‌ హాఫ్‌ను ప్రారంభించిన తీరు బాగుంటుంది.

అయితే విక్కీ (ఆంటోనీ వర్గీస్‌) ఫ్లాష్‌బ్యాక్‌ మొదలైన తర్వాత సినిమా గాడి తప్పుతుంది. ఆ ఫ్లాష్‌బ్యాక్‌ మొత్తం రొటీన్‌ డ్రామాలా అనిపిస్తుంది.

క్రికెట్‌ నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లోనూ పెద్దగా కొత్తదనం కనిపించదు. డేవిడ్‌ పాత్రలో ఏదైనా భిన్నత్వం ఉంటుందని భావిస్తే.. అక్కడ కూడా నిరాశే ఎదురవుతుంది.

వివరాలు

రోటీన్ గానే విలన్ పాత్ర

మిస్కిన్‌ పోషించిన విలన్‌ పాత్ర రొటీన్‌గానే అనిపిస్తుంది. ముఖ్యంగా విక్కీ ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఎమోషనల్‌ డ్రామా ఆశించిన స్థాయిలో పండలేదు.

దీంతో ఆ సన్నివేశాలు చాలావరకు సాగదీసినట్లుగా అనిపిస్తాయి. కథ మళ్లీ వర్తమానంలోకి వచ్చిన తర్వాతే సినిమా తిరిగి గాడిలో పడుతుంది.

పతాక సన్నివేశాల్లో డ్యాన్‌, అతడి కుడి చేయి చేసే యాక్షన్‌ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

డ్యాన్‌ జాన్‌ పాత్రలో దుల్కర్‌ సల్మాన్‌ అద్భుతంగా ఒదిగిపోయాడు. సినిమా ప్రారంభ సన్నివేశాల్లో స్టైలిష్‌గా కనిపించిన ఆయన.. ఆ తర్వాత కుడి చేయిని నియంత్రించలేని వ్యక్తిగా కనిపించే సన్నివేశాల్లో తన నటనతో మెప్పించాడు.

ముఖ్యంగా తన కుడి చేతితోనే తాను ఫైట్‌ చేసే సన్నివేశం సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది.

వివరాలు

ఎవరెలా చేశారంటే..

తెరపై కనిపించే రెండు చేతులూ దుల్కర్‌వే అయినప్పటికీ.. కుడి చేయి దుల్కర్‌ను కొట్టేస్తోందనే భావన ప్రేక్షకుడికి కలిగేలా ఆ సన్నివేశాన్ని రూపొందించారు.

ఆంటోనీ వర్గీస్‌ తన పాత్ర పరిధిలో బాగానే నటించాడు. మిస్కిన్‌ మాత్రం రొటీన్‌ విలన్‌గా కనిపించాడు. కయాదు లోహర్‌, సంయుక్త విశ్వనాథన్‌ తమకు ఇచ్చిన పాత్రల పరిధిలో నటించారు.

సాంకేతికంగా సినిమా బాగానే ఉంది. జేక్స్‌ బిజోయ్‌ అందించిన సంగీతం పలు సన్నివేశాలను మరింత ఎలివేట్‌ చేసింది.

అయితే సినిమా నిడివి విషయంలో దర్శకుడు మరింత జాగ్రత్త తీసుకోవాల్సింది.

ముఖ్యంగా ద్వితీయార్ధంలో చాలా సన్నివేశాలకు కత్తెర వేసి ఉంటే సినిమా మరింత ఆసక్తికరంగా, షార్ప్‌గా ఉండేది. దర్శకుడు నహాస్‌ హిదయత్‌ ఎంచుకున్న ప్రధాన పాయింట్‌లో మంచి కొత్తదనం ఉంది.

వివరాలు

బలాలు

అయితే డ్యాన్‌, అతడి కుడి చేయి చుట్టూ మరికొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలను రాసుకుని, విక్కీ ఫ్లాష్‌బ్యాక్‌ నిడివిని తగ్గించి ఉంటే సినిమా మరింత బిగువుగా ఉండేది.

దుల్కర్‌ సల్మాన్‌ నటన

ప్రథమార్ధం

విరామ సన్నివేశాలు

బలహీనతలు

సినిమా నిడివి

ద్వితీయార్ధంలోని కొన్ని సన్నివేశాలు

ఫ్లాష్‌బ్యాక్‌ డ్రామా చివరిగా..

'ఐమ్‌ గేమ్‌'.. ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ అదిరింది.. సెకండ్‌ ఇన్నింగ్స్‌ తేలిపోయింది.

ADVERTISEMENT