Manushi Chhillar: నేనూ నీట్ పేపర్ లీక్ బాధితురాలినే.. మానుషి చిల్లర్ ఎమోషనల్ కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
బాలీవుడ్ నటి, మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ తాజాగా నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనపై స్పందిస్తూ.. తాను కూడా ఒకప్పుడు నీట్ పేపర్ లీక్ బాధితురాలినేనని వెల్లడించారు. 2015లో జరిగిన పేపర్ లీక్ కారణంగా తాను మళ్లీ పరీక్ష రాయాల్సి వచ్చిందని, ఆ అనుభవం తన జీవితంలో అత్యంత కఠినమైన దశగా నిలిచిందని తెలిపారు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన మానుషి.. డాక్టర్ కావాలన్న లక్ష్యంతో ఎంతో కష్టపడి నీట్‌కు సిద్ధమైనట్లు చెప్పారు. అయితే ప్రశ్నాపత్రం లీక్ కావడంతో పరీక్ష రద్దై, మరోసారి పరీక్షకు హాజరుకావాల్సి వచ్చిందన్నారు. నీట్ ప్రవేశ పరీక్ష కోసం నెలల తరబడి ఎంతో శ్రమించి చదివాను. పేపర్ లీక్ అయ్యిందన్న వార్త తెలిసినప్పుడు తీవ్ర నిరాశకు గురయ్యాను.
వివరాలు
చాలా ఒత్తిడిని ఎదుర్కొన్నా
ఆ సమయంలో మానసికంగా చాలా ఒత్తిడిని ఎదుర్కొన్నాను. అయితే నా తల్లిదండ్రులు నాకు ఎంతో ధైర్యం చెప్పారు. వారి ప్రోత్సాహంతో మళ్లీ పరీక్ష రాసి అర్హత సాధించానని మానుషి తెలిపారు.
ప్రతి విద్యార్థికి తనలాంటి పరిస్థితులు ఉండవన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి హాస్టళ్లలో ఉంటూ చదువుకునే విద్యార్థులు ఆ సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు.
పేపర్ లీక్ వంటి ఘటనలు వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. హరియాణాకు చెందిన మానుషి చిల్లర్ తల్లిదండ్రులు మిత్రా బసు, నీలిమా ఇద్దరూ వైద్యులే.
డాక్టర్ కావాలన్న లక్ష్యంతో నీట్ పరీక్ష రాసిన ఆమె.. అనంతరం మోడలింగ్‌లో అడుగుపెట్టి మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకుని, ప్రస్తుతం బాలీవుడ్‌లో నటిగా కొనసాగుతున్నారు.