Venky Atluri:'విశ్వనాథ్ అండ్ సన్స్' కథకు సూర్య ఒప్పుకుంటారో లేదో భయపడ్డా: వెంకీ అట్లూరి
ఈ వార్తాకథనం ఏంటి
'సార్', 'లక్కీ భాస్కర్' వంటి వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న దర్శకుడు వెంకీ అట్లూరి.. ఇప్పుడు తమిళ స్టార్ హీరో సూర్యతో కలిసి తెరకెక్కించిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సూర్య, మమితా బైజు జంటగా నటించిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా విశేషాలతో పాటు తన సినీ ప్రయాణానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెంకీ అట్లూరి వెల్లడించారు.
వివరాలు
సూర్య ఒప్పుకుంటారో లేదోనని భయపడ్డా
ఈ సినిమా కథ 40 ఏళ్ల వ్యక్తి, 20 ఏళ్ల యువతి మధ్య జరిగే ప్రేమకథ నేపథ్యంలో సాగుతుంది. ఇలాంటి భిన్నమైన కథను సూర్య అంగీకరిస్తారో లేదోనని మొదట నాకు సందేహం కలిగింది.
అందుకే ముందుగా ఈ కథను సూర్య స్నేహితుడు రాజశేఖర్ పాండియన్‌కు వినిపించాను. ఆయనకు కథ బాగా నచ్చడంతో తర్వాత సూర్యకు చెప్పాను.
కథలో కొన్ని చిన్న చిన్న మార్పులు సూచించిన ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అలా కేవలం మూడు నెలల్లోనే షూటింగ్ ప్రారంభమైంది'' అని వెంకీ తెలిపారు.
వివరాలు
క్లైమాక్స్‌ను 10 సార్లకు పైగా మార్చా
సినిమా ముగింపు విషయంలో సూర్య ఎంతో శ్రద్ధ చూపించారని వెంకీ చెప్పారు.
''ప్రేక్షకులందరికీ నచ్చేలా క్లైమాక్స్ ఉండాలని సూర్య పట్టుబట్టారు. అందుకే దాదాపు 10 సార్లకు పైగా క్లైమాక్స్‌ను తిరిగి రాశాను.
నా కెరీర్‌లో ఇప్పటివరకు చేసిన చిత్రాల్లో ఇదే అత్యంత కఠినమైన రైటింగ్ ప్రాసెస్ అని వెల్లడించారు.
సూర్య పెద్దన్నలాంటివారు
సూర్యతో పనిచేసిన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ.. ధనుష్, దుల్కర్, సూర్య.. వీరందరిలోనూ ఒకే లక్షణం కనిపిస్తుంది. అదే క్రమశిక్షణ. సూర్య నాకు పెద్దన్నలాంటివారు.
షూటింగ్ సమయంలో సీనియర్ నటులతో తన అనుభవాలను పంచుకుంటూ మమ్మల్ని ప్రోత్సహించేవారు. ఆయన నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని వెంకీ చెప్పారు.
వివరాలు
మమితాను ఎందుకు ఎంపిక చేశామంటే..
'ప్రేమలు' సినిమాలో మమితా బైజు నటన తనను బాగా ఆకట్టుకుందని వెంకీ తెలిపారు. ''ఆమె నటన ఎంతో సహజంగా అనిపించింది. అందుకే 'విశ్వనాథ్ అండ్ సన్స్' కోసం ఆమెను ఎంపిక చేశాం. సూర్య-మమితా జోడీ తెరపై చాలా అందంగా కనిపిస్తుందని అన్నారు.
సినిమా విజయాన్ని తాను బాక్సాఫీస్ వసూళ్లతో కొలవనని వెంకీ స్పష్టం చేశారు.
''నేను ఎప్పుడూ కలెక్షన్ల లెక్కలు చూసుకోను. 100 మందిలో కనీసం 75 మందికి నా సినిమా నచ్చితే అదే నాకు పెద్ద విజయం. అందరినీ మెప్పించడం సాధ్యం కాదు.
కలెక్షన్ల కంటే ప్రేక్షకుల ఆదరణే నాకు ముఖ్యమైనది. 'లక్కీ భాస్కర్', 'కాంతార' వంటి చిత్రాలు భాషతో సంబంధం లేకుండా విజయం సాధించడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు.
వివరాలు
'లక్కీ భాస్కర్' సీక్వెల్‌పై క్లారిటీ
'లక్కీ భాస్కర్' సీక్వెల్‌పై కూడా వెంకీ అట్లూరి స్పందించారు.
''ప్రస్తుతం నా చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. అవి పూర్తి కావడానికి దాదాపు రెండేళ్లు పడుతుంది.
ఆ రెండు సినిమాలు పూర్తయ్యాకే 'లక్కీ భాస్కర్' సీక్వెల్‌పై పూర్తిగా దృష్టి పెడతానని స్పష్టం చేశారు.