LOADING...
Ibomma: ఐబొమ్మ అడ్మిన్ అరెస్ట్.. విదేశీ ఐపీ అడ్రస్‌లతో కొత్త ముఠాల పైరసీ దందా 
ఐబొమ్మ అడ్మిన్ అరెస్ట్.. విదేశీ ఐపీ అడ్రస్‌లతో కొత్త ముఠాల పైరసీ దందా

Ibomma: ఐబొమ్మ అడ్మిన్ అరెస్ట్.. విదేశీ ఐపీ అడ్రస్‌లతో కొత్త ముఠాల పైరసీ దందా 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2025
10:21 am

ఈ వార్తాకథనం ఏంటి

సినిమా రంగానికి భారీగా నష్టాన్ని తెచ్చిపెడుతున్న పైరసీ గుంపులపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం కఠిన చర్యలు ప్రారంభించింది. డిజిటల్ ప్లాట్‌ఫారంలను చొరబడి, కాపీరైట్ కలిగిన సినిమాలను అనధికారిక వెబ్‌సైట్లకు చేరవేసే ముఠాల కార్యకలాపాలను పోలీసులు వరుసగా అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో, పేరొందిన పైరసీ సైట్ 'iBomma' నిర్వాహకుడు రవిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. అంతకుముందు, బిహార్‌కు చెందిన అశ్వనీకుమార్ ఆధ్వర్యంలో నడుస్తున్న మరో పైరసీ గుంపును కూడా నెల క్రితం పోలీసులు పట్టుకున్నారు. విదేశాల్లో నుంచే వ్యవహారాలను నడిపిన రవి, 'iBomma' ప్లాట్‌ఫారంలో దాదాపు రెండు వేల సినిమాలను పోస్ట్ చేసి భారీగా ఆదాయం సంపాదించినట్లు విచారణలో తెలిసింది.

వివరాలు 

సినిమా పరిశ్రమకు రూ.22,400 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా 

అలాగే, ఈ సైట్ ద్వారా సుమారు 50 లక్షల మంది వినియోగదారుల వ్యక్తిగత వివరాలను కూడా సేకరించినట్లు అధికారులు గుర్తించారు. ఆయన కార్యకలాపాల వల్ల సినిమా పరిశ్రమకు వేల కోట్ల నష్టం వాటిల్లిందని పోలీసులు వెల్లడించారు. ఇక అశ్వనీకుమార్ గుంపు విషయానికి వస్తే..2020 నుంచి దేశవ్యాప్తంగా దాదాపు 500 చిత్రాలను అక్రమంగా అప్‌లోడ్ చేసినట్లు తేలింది. వీరి పైరసీ కారణంగా భారత దేశంలోని వివిధ సినీ పరిశ్రమలకు మొత్తం రూ.22,400 కోట్లు, అందులో తెలుగు పరిశ్రమకి మాత్రమే సుమారు రూ.3,700 కోట్ల మేర నష్టం జరిగినట్లు అంచనా. 'హిట్: ది థర్డ్ కేస్', 'కుబేరా', 'హరి హర వీరమల్లు' వంటి పెద్ద సినిమాలు కూడా ఈ ముఠా లక్ష్యంగా మారినట్లు తెలిసింది.

వివరాలు 

మరిన్ని ముఠాలపై దృష్టి సారించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 

హ్యాకింగ్‌లో నైపుణ్యం ఉన్న అశ్వనీకుమార్, బెట్టింగ్ యాప్‌లు, టెలిగ్రామ్ ఛానళ్లను వినియోగించి పైరసీ కంటెంట్‌ను పంచేవాడని దర్యాప్తులో బయటపడింది. ఈ రెండు ముఠాలతో పాటు మరికొన్ని గుంపులు కూడా చురుకుగా ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. తమ ఐపీ అడ్రెస్‌లను నెదర్లాండ్స్, పారిస్ వంటి దేశాలకు మార్చుకుంటూ కొత్త ముఠాలు పైరసీ కొనసాగిస్తున్నట్లు, వారిని కూడా గుర్తించి చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సైబర్ క్రైమ్ అధికారులు తెలిపారు. థియేటర్లలో జరిగే క్యామ్ రికార్డింగ్ పైరసీకి ప్రధాన మూలమని, హోస్టింగ్ సర్వర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు.