IBomma: ఐబొమ్మ-బప్పం టీవీ సైట్లు క్లోజ్.. సోషల్ మీడియా సవాల్‌కు పోలీసుల సమాధానం!
ఈ వార్తాకథనం ఏంటి
ఐబొమ్మ, బప్పం టీవీ వంటి వెబ్‌సైట్లను సైబర్ క్రైమ్ అధికారులు పూర్తిగా షట్‌డౌన్ చేశారు. శనివారం అరెస్టైన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ద్వారా వీటి మూసివేతను అమలు చేయించారు. ఆయన్నుంచి సొంతంగా పొందిన వెబ్‌లాగిన్‌లు, సర్వర్‌కు సంబంధించిన కీలక వివరాలతో ఈ సైట్లను నిలిపివేశారు. గతంలో 'నా వద్ద కోట్ల మంది డేటా ఉంది. ఈ వెబ్‌సైట్ మీద ఫోకస్ చేయటం ఆపండి' అంటూ గతంలో అతడు పోలీసులకు సవాల్ విసిరినట్లు సామాజిక మాధ్యమాల్లో ఓ లేఖ చక్కర్లు కొట్టింది. ఈ నేపథ్యంలోనే రవిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఆ సవాల్‌కు జవాబుగా ఆయనే చేత ఆ వెబ్‌సైట్లను క్లోజ్ చేయించడం గమనార్హం.
వివరాలు
కస్టడీ పిటిషన్‌ను దాఖలు చేయనున్న పోలీసులు
ఇమ్మడి రవి నుండి స్వాధీనం చేసుకున్న వందల సంఖ్యలోని హార్డ్‌డిస్క్‌లను పోలీసులు ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. అలాగే అతడి బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన లావాదేవీలను కూడా విపులంగా చెక్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు వెలికి తీయడానికి రవిని పోలీస్ కస్టడీలోకి తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. దీనికి సంబంధించి కస్టడీ పిటిషన్‌ను పోలీసులు సోమవారం నాంపల్లి కోర్టులో దాఖలు చేయనున్నారు.