LOADING...
Andhra Pradesh: కృష్ణానదిపై 6 లేన్ల ఐకానిక్ వంతెన.. అమరావతికి కొత్త చిహ్నం
కృష్ణానదిపై 6 లేన్ల ఐకానిక్ వంతెన.. అమరావతికి కొత్త చిహ్నం

Andhra Pradesh: కృష్ణానదిపై 6 లేన్ల ఐకానిక్ వంతెన.. అమరావతికి కొత్త చిహ్నం

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 20, 2025
10:58 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని దేశంలోని ప్రధాన నగరాల వెంట నేరుగా అనుసంధానించే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు సక్రమమైన ప్రణాళికపై ఫోకస్ పెట్టారు. గ్రీన్ ఫీల్డ్ నగరంగా ప్రపంచ ప్రమాణాల మౌలిక సదుపాయాలతో అమరావతిని తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యం. ఈ క్రమంలో ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం భేటీ అయ్యారు. సమావేశంలో రాష్ట్రంలోని జాతీయ రహదారుల నెట్‌వర్క్ బలోపేతంపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. ప్రధానంగా కృష్ణానదిపై ప్రతిపాదించిన 6 లేన్ల ఐకానిక్ కేబుల్ స్టెడ్ వంతెన నిర్మాణంపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. రాజధాని అమరావతికి సింబలిక్‌గా నిలిచే ఈ వంతెన నిర్మాణ బాధ్యతను జాతీయ రహదారుల సంస్థకి అప్పగించమని సీఎం కోరారు.

Details

అమరావతిని మూడు కీలక జాతీయ రహదారులతో నేరుగా అనుసంధానించవచ్చు

మూలపాడు వద్ద నిర్మించబడే ఈ వంతెన ద్వారా అమరావతిని మూడు కీలక జాతీయ రహదారులతో నేరుగా అనుసంధానించవచ్చని వివరించారు. ఈ వంతెన ద్వారా విజయవాడ-హైదరాబాద్, చెన్నై-కోల్‌కతా నేషనల్ హైవేలు, అలాగే తీరప్రాంత రోడ్ కారిడార్ నేరుగా కలిసిపోతుందని సీఎం తెలిపారు. అంతేకాక హైదరాబాద్-అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రతిపాదనపై కూడా సీఎం-గడ్కరీ చర్చించారు. ఈ హై-స్పీడ్ యాక్సెస్ కంట్రోల్ రోడ్డు పూర్తయ్యాక రెండు ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని సీఎం స్పష్టం చేశారు.

Details

 నితిన్ గడ్కరీ చేస్తున్న కృషిని అభినందించిన చంద్రబాబు 

అమరావతిని నేషనల్ హైవే గ్రిడ్‌లో ఒక మొబిలిటీ కేంద్రంగా, అలాగే లాజిస్టిక్స్ నోడ్‌గా రూపకల్పన చేయడమే ప్రభుత్వ లక్ష్యం. ఈ సందర్భంగా దేశంలో జాతీయ రహదారుల నెట్‌వర్క్ విస్తరణలో నితిన్ గడ్కరీ చేస్తున్న కృషిని చంద్రబాబు ప్రశంసించారు. రహదారుల అభివృద్ధి కేవలం కనెక్టివిటీ మాత్రమే కాకుండా, ప్రాంతీయ ఆర్థిక ప్రగతికి బలమైన పునాదులను వేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతిని నేషనల్ హైవేలతో ప్రత్యక్ష, పరోక్ష అనుసంధానంతో రాజధాని అభివృద్ధి వేగవంతం అవుతుందని సీఎం తెలిపారు. రాష్ట్రానికి కీలకమైన ఈ ప్రాజెక్టుల విషయంలో కేంద్రం పూర్తి సహకారం అందించాలని కోరగా, నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు.

Advertisement