LOADING...
V.N Adithya: సినిమా ఆగితే పస్తులతో ఉండాల్సిందే.. దర్శకుడు సంచలన వ్యాఖ్యలు!
సినిమా ఆగితే పస్తులతో ఉండాల్సిందే.. దర్శకుడు సంచలన వ్యాఖ్యలు!

V.N Adithya: సినిమా ఆగితే పస్తులతో ఉండాల్సిందే.. దర్శకుడు సంచలన వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 18, 2025
04:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు సినీ ఫెడరేషన్‌ కార్మికులు వేతనాలను 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ, రెండు వారాలుగా సమ్మె బాట పట్టారు. షూటింగులు నిలిచిపోవడంతో నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సినిమాలు సరిగా ఆడకపోతున్న పరిస్థితుల్లో వేతనాలు భారీగా పెంచడం సాధ్యం కాదని, తమ సమస్యలు కూడా అర్థం చేసుకోవాలని నిర్మాతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాతలపై విమర్శలు గుప్పిస్తున్న యూనియన్ నాయకుల తీరుపై దర్శకుడు వి.ఎన్. ఆదిత్య తనదైన శైలిలో సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఒక వ్యక్తి సినిమాల్లోకి వచ్చి, లాభం వచ్చినా నష్టం వచ్చినా సినిమాలనే చేస్తూ, తన బయటి వ్యాపారాల లాభాలను కూడా సినీ రంగంలో పెట్టుబడిగా పెట్టి, పదేళ్లలో దాదాపు వెయ్యికోట్లకు పైగా పెట్టుబడి పెట్టాడు.

Details

లక్షలాది మంది ఉపాధికి దెబ్బ

ఫ్లాప్‌లు, ట్రోలింగ్‌లను ఎదుర్కొంటూ ఈ రంగంలో నిలబడతాడు. అలాంటి వ్యక్తిని ప్రోత్సహించాల్సింది పోయి, అబద్ధపు ప్రచారాలు, స్వార్థపూరిత రాజకీయాలు, కుల వివక్షలతో పెట్టుబడులు మళ్లింపజేసేలా ప్రవర్తిస్తే నష్టం ఎవరికో ఆలోచించాలి. యాభై సినిమాలకు ఆయన పెట్టిన డబ్బుతోనే రెండు వందల మందికి పదేళ్ల పాటు మూడు పూటల భోజనం లభించింది. అది కొద్ది పెద్ద సినిమాల బడ్జెట్‌కే సమానమన్నారు. కారు డ్రైవర్లకు, ప్రొడక్షన్ బాయ్స్‌కు డబ్బులు ఇవ్వకుండా, హీరో-హీరోయిన్లకే పారితోషికాలు పెంచే నిర్మాతలపై ఒక్కమాట మాట్లాడని యూనియన్ నాయకులు, నిజంగా వందలమందికి ఉపాధి కల్పించే నిర్మాతలపై మాత్రం విరుచుకుపడుతున్నారు. ఏ కార్మిక సంఘం అయినా అన్యాయం చేసే నిర్మాతలపై పోరాడాలని, ఈ సమ్మె వల్ల లక్షలమంది కార్మికుల కడుపులు మంటిస్తున్నాయి.

Details

సమ్మె చేయడం ఎవరికి లాభం

వాళ్ల ఆకలి సమస్యకు యూనియన్ నాయకులు సమాధానం చెప్పగలరా? కళారంగంలో పని దొరకడం ముఖ్యం, దానిని ఆపడం కాదు. యూనియన్లు ఉంటే ఒకరోజైనా షూటింగ్ జరగడానికి సహకరించాలి. ఆపడానికి కాదన్నారు. ఎన్నుకున్న నాయకులు సమస్యలకు పరిష్కారం చూపి, షూటింగులకు అంతరాయం కలగకుండా చూడాలి. పని ఉంటే గాని డబ్బు, అన్నం లభించని రంగంలో సమ్మె చేయడం వల్ల ఎవరికీ లాభం ఉండదు. నేను ఏ పదవిలో లేను, సాధారణ సభ్యుడినే. కానీ ముప్ఫై అయిదేళ్లుగా సినీ రంగంలో జరిగిన ప్రతి మార్పుకు ప్రత్యక్ష సాక్షిని. రెండు శాతం విజయావకాశాలే ఉన్న రంగానికి పెట్టుబడులు తెప్పించడం చాలా కష్టం.

Details

చర్చలతోనే సమస్యలను పరిష్కరించాలి

నా వల్లే ఈ రంగానికి 32 జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. ఇంతకన్నా మాట్లాడడానికి మరే అర్హత కావాలన్నారు. నిర్మాతలు సినిమాలు తీయనివ్వండి, అప్పుడు కార్మికులు బాగుంటారు. షూటింగులు ఆపేస్తే అడుక్కు తినాల్సి వస్తుంది. సినిమా అనేది పని చేసేవాడికి భోజనం పెడుతుంది, కానీ పని లేకపోతే పస్తులు పెడుతుంది. ఇది గుర్తుంచుకుని వ్యవహరించండి. సమ్మెతో సమస్యలు పరిష్కారం కావు. సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారం అవుతాయని ఆయన వివరించారు. అంతేకాకుండా దాసరి నారాయణరావు, చిరంజీవి, తమ్మారెడ్డి భరద్వాజ, మోహన్ బాబు, బాలకృష్ణ లాంటి పెద్దలు ఎప్పుడూ ఇలాంటి సమస్యల్లో సమ్మె పరిష్కారం కాదని, చర్చలతోనే సమస్యలు పరిష్కరించుకోవాలని చెబుతారని గుర్తు చేశారు. అదే నిజమైన నాయకత్వమని వి.ఎన్. ఆదిత్య స్పష్టం చేశారు.