Anchor Shivajyothi : తిరుమల ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు.. యాంకర్ శివజ్యోతి పై తీవ్ర ఆగ్రహం!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ యాంకర్ శివజ్యోతి తిరుమల శ్రీవారి దర్శనం సందర్భంగా క్యూ లైన్‌లో నిలబడి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. శ్రీవారి ప్రసాదంపై ఆమె చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని, హిందూ సంఘాలు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శివజ్యోతి తన భర్త, స్నేహితులతో కలిసి తిరుమల దర్శనానికి వెళ్లి క్యూ లైన్లో ఎదురు చూస్తుండగా, టీటీడీ సేవకులు భక్తులకు అన్నప్రసాదం (సాంబార్ రైస్, పెరుగు అన్నం) అందించారు. ఈ సమయంలో ప్రసాదం తీసుకున్న ఆమె, స్నేహితునితో మాట్లాడుతూ 'తిరుమలలో కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం' తిరుపతిలో రిచెస్ట్ బిచ్చగాళ్లం మేమే అంటూ వ్యాఖ్యానించారు.
Details
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు
సంభాషణను వీడియో రూపంలో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్ అయ్యింది. సరదాగా మాట్లాడినా, పవిత్రమైన ప్రసాదాన్ని అపహాస్యం చేస్తున్నట్టుగా ఉన్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులు శ్రీవారి ప్రసాదాన్ని దేవుని ఆశీర్వాదంగా భావిస్తారు. దాన్ని అడుక్కోవడం, బిచ్చగాళ్లు అనే వ్యాఖ్యలతో పోల్చడం తిరుమల పవిత్రతను అవమానించడం అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. దేవాలయంలో పేద-ధనిక తేడా లేకుండా అందరికీ సమానంగా ప్రసాదం ఇవ్వబడుతుందని, దాని విలువను తగ్గించే వ్యాఖ్యలు చేయడం సరికాదని వ్యాఖ్యానిస్తున్నారు.
Details
టీటీడీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి
అదనంగా, ఆలయ ప్రాంగణంలో వీడియోలు తీయడంపై టీటీడీ ఇప్పటికే నిషేధం విధించినప్పటికీ, శివజ్యోతి ఆ నిబంధనలను ఉల్లంఘించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై హిందూ సంఘాలు, భక్తులు టీటీడీ అధికారులను కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో స్వామివారికి భక్తితో వ్రతాలు చేసి బిడ్డ కోసం మొక్కుకున్న శివజ్యోతి, ఇప్పుడు ప్రసాదంపై ఇలాంటి మాటలు మాట్లాడటం షాకింగ్ అని పలువురు అంటున్నారు. సెలబ్రిటీలు మతపరమైన ప్రదేశాల్లో మరింత శ్రద్ధ, బాధ్యతతో ఉండాలని భక్తులు సూచిస్తున్నారు. ఈ వివాదంపై శివజ్యోతి లేదా టీటీడీ అధికారులు ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఆమె క్షమాపణ చెప్పుతారేమో చూడాల్సి ఉంది.