Emergency: కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' సినిమాకు యూకేలో అడ్డంకులు.. స్పందించిన భారత విదేశాంగ శాఖ
ఈ వార్తాకథనం ఏంటి
కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం 'ఎమర్జెన్సీ' (Emergency).
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితి ప్రకటించిన కాలాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించింది ఈ చిత్రం.
చాలా సార్లు వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా చివరకు ఈ నెల 17న బాక్సాఫీస్ ముందుకు వచ్చింది.
అయితే బ్రిటన్‌లో ఈ సినిమాకు కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు.
వివరాలు
అడ్డంకులు కలిగించే వారిపై చర్యలు
'''ఎమర్జెన్సీ' చిత్రాన్ని అనేక సినిమా హాళ్లలో ప్రదర్శించకుండా అడ్డుకుంటున్నారన్న కథనాలు, నివేదికలు మా దృష్టికి వచ్చాయి. భారత వ్యతిరేక మూకల నుంచి వచ్చే బెదిరింపులు, హింసాత్మక నిరసనల అంశాలను యూకే ప్రభుత్వానికి నివేదించాము. ఈ సినిమాను ప్రదర్శించడంలో అడ్డంకులు కలిగించే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. యూకే ప్రభుత్వం ఈ విషయంలో సరైన విధంగా స్పందిస్తుందని మా నమ్మకం. భారత దౌత్య కార్యాలయం ద్వారా అక్కడి పరిస్థితులపై ఎప్పటికప్పుడు గమనిస్తున్నాం,'' అని జైస్వాల్ వెల్లడించారు.
'ఎమర్జెన్సీ' చిత్రాన్ని ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద కొందరు ఖలిస్థానీ సానుభూతిపరులు మాస్కులు ధరించి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు కథనాలు వెలువడిన నేపథ్యంలో, భారత విదేశాంగ శాఖ తాజా చర్యలు చేపట్టింది.