Darshan: ఇలాగే జైలులో ఉంచడం కంటే ఉరిశిక్ష వేయండి.. దర్శన్ తరపున లాయర్ ఆవేదన!
ఈ వార్తాకథనం ఏంటి
అభిమాని హత్య కేసులో జైలులో ఉన్న కన్నడ నటుడు దర్శన్ ఆవేదన వ్యక్తం చేశాడు. జైలులో తనకు కనీస సదుపాయాలు కూడా ఇవ్వడం లేదని ఆయన వాపోయాడు. విచారణ కొనసాగుతున్నప్పటికీ ఇప్పటివరకు బెయిల్ మంజూరు కాలేదని, ఇప్పటికే 20 సార్లు దరఖాస్తు చేసినా పరిగణనలోకి తీసుకోలేదని ఆయన పేర్కొన్నాడు. ఈ పరిస్థితుల్లో తనను ఇలానే జైలులో ఉంచడం కంటే విచారణను వేగంగా ముగించి ఉరిశిక్ష వేస్తేనే మంచిదని దర్శన్ ఆవేదనతో తెలిపాడు. ఈ విషయాన్ని దర్శన్ తరపున న్యాయవాది సునీల్ కోర్టులో వివరించారు. జైలులో తన క్లయింట్‌కు ఖైదీలకు ఇవ్వాల్సిన కనీస సదుపాయాలు కూడా కల్పించడం లేదని ఆయన ఆరోపించారు.
Details
జైలు అధికారులు పట్టించుకోలేదు
దర్శన్‌కు తగిన సదుపాయాలు కల్పించాలనే విజ్ఞప్తులు ఎన్నిసార్లు చేసినా జైలు అధికారులు పట్టించుకోలేదని ఆయన అన్నారు. కనీస సౌకర్యాలు లేక, వరుసగా బెయిల్ తిరస్కరణలతో దర్శన్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నాడని సునీల్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అలాగే దర్శన్ విచారణను త్వరగా పూర్తి చేసి శిక్ష విధిస్తే దాన్ని భరిస్తానని, ఆ అనుభవానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. వెన్నునొప్పి సమస్య మళ్లీ తీవ్రమైందని, గతంలో "సైనేడ్ ఇచ్చినా తిని ఆత్మహత్య చేసుకుంటా" అని దర్శన్ చెప్పిన వ్యాఖ్యలను కూడా న్యాయవాది ఈ సందర్భంగా గుర్తు చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వు చేస్తూ, తదుపరి విచారణను అక్టోబర్ 29వ తేదీకి వాయిదా వేసింది.