ఇంట్రెస్టింగ్ టైటిల్ తో హీరోగా వస్తున్న వరుణ్ సందేశ్
హ్యాపీడేస్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టి, ఆ తర్వాత కొత్త బంగారు లోకం మూవీతో హిట్ కొట్టిన వరుణ్ సందేశ్, తన పాపులారిటీని ఎక్కువ రోజులు కాపాడుకోలేకపోయాడు. హీరోగా వరుస ఫ్లాపులు తెచ్చుకున్నాక సడెన్ గా మైఖేల్ మూవీతో విలన్ గా మారాడు వరుణ్ సందేశ్. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన మైఖేల్, బాక్సఫీసు వద్ద చతికిల పడటంతో వరుణ్ సందేశ్ కి పెద్దగా పేరు రాలేదు. అదలా ఉంచితే ప్రస్తుతం మళ్ళీ హీరోగా మారాడు వరుణ్ సందేశ్. అవును, చిత్రం చూడర అంటూ ఆసక్తికర టైటిల్ తో వస్తున్నాడు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ఈరోజే విడుదలైంది. ఇందులో కమెడియన్ ధన్ రాజ్, కాశీ విశ్వనాథ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
కామెడీ ప్రధానంగా తెరకెక్కిన చిత్రం చూడర
ఫస్ట్ లుక్ లో వరుణ్ సందేశ్, ధన్ రాజ్, కాశీ విశ్వనాథ్ పాత్రలు పోలీస్ లాకప్ లో కూర్చున్నట్లుగా కనిపిస్తోంది. ట్విట్టర్ లో వరుణ్ సందేశ్ మాటల ప్రకారం, ఈ మూవీ కామెడీ ప్రధానంగా తెరకెక్కినట్లు అర్థమవుతోంది. తనికెళ్ళ భరణి, రాజా రవీంద్ర, శివాజీ రాజా, శీతల్ భట్, మీనా కుమారి, అన్నపూర్ణమ్మ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ఆర్ఎన్ హర్షవర్ధన్ డైరెక్ట్ చేస్తున్నారు. నేనింతే ఫేమ్ అదితి గౌతమ్ ఓ ప్రత్యేక గీతంలో కనిపించనున్నారట. బీఎమ్ సినిమాస్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాను. శేషు మారామ్ రెడ్డి, బోయపాటి భాగ్యలక్ష్మి నిర్మిస్తున్నారు. రాధన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేస్తారని సమాచారం.