Priyanka Mohan: ప్రియాంక మోహన్‌కు అంతర్జాతీయ గుర్తింపు.. కొరియా ప్రభుత్వం అధికారిక ప్రకటన!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రఖ్యాత నటి ప్రియాంక అరుళ్ మోహన్‌కు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. ఆమెను దక్షిణ కొరియా పర్యాటక గౌరవ రాయబారిగా నియమిస్తున్నట్లు కొరియా ప్రభుత్వం, కొరియా పర్యాటక సంస్థ (KTO) అధికారికంగా ప్రకటించాయి. ఇటీవల ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'మేడ్ ఇన్ కొరియా' చిత్రం విడుదలైన నేపథ్యంలో ఈ గౌరవం లభించడం విశేషంగా మారింది. కొరియా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం అక్కడి సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించడంతో ప్రియాంకను ఈ బాధ్యతలకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రియాంక మోహన్ సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. కొరియా పర్యాటక గౌరవ రాయబారిగా ఎంపిక కావడం నాకు ఎంతో ప్రత్యేకమైన గౌరవం.
వివరాలు
చాలా సంతోషంగా ఉంది
కొరియా సంస్కృతి, సంప్రదాయాలను భారతీయ ప్రేక్షకులకు మరింత చేరువ చేసే వ్యక్తిగా నన్ను గుర్తించినందుకు కొరియా ప్రభుత్వం, కొరియా పర్యాటక సంస్థకు హృదయపూర్వక కృతజ్ఞతలు. కొరియా సంస్కృతి, అక్కడి ప్రజల ఆప్యాయత నన్ను ఎప్పుడూ ఆకట్టుకుంటాయి. ఈ అందమైన ప్రయాణంలో భాగం కావడం చాలా సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ప్రియాంకకు కొరియాతో అనుబంధం మరింత బలపడింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్వహించిన ప్రత్యేక విందులో ఆమె పాల్గొన్నారు.
వివరాలు
మార్చి 12న నేరుగా నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్
ఆ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ కూడా హాజరయ్యారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఆ విందులో అగ్ర నాయకులతో కలిసి పాల్గొనడం తన జీవితంలో మరపురాని అనుభవమని ప్రియాంక అప్పట్లో సోషల్ మీడియాలో వెల్లడించారు. అలాగే తన 'మేడ్ ఇన్ కొరియా' చిత్రాన్ని వారు అభినందించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. దర్శకుడు రా కార్తీక్ తెరకెక్కించిన 'మేడ్ ఇన్ కొరియా' చిత్రం మార్చి 12న నేరుగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైంది.
వివరాలు
అంతర్జాతీయ స్థాయిలో మరో గౌరవం
దక్షిణ కొరియాలో చిత్రీకరణ జరుపుకున్న తొలి తమిళ చిత్రంగా ఈ సినిమా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇప్పుడు అదే 'మేడ్ ఇన్ కొరియా' చిత్రం ఆమెకు అంతర్జాతీయ స్థాయిలో మరో గౌరవాన్ని తీసుకురావడం విశేషం. దక్షిణ కొరియా పర్యాటక గౌరవ రాయబారిగా ప్రియాంక నియామకం ఆమె కెరీర్‌లో మరో కీలక మైలురాయిగా నిలిచింది.