Mega158: మెగాస్టార్ మూవీకి 'జైలర్' టెక్నీషియన్.. అంచనాలు పెంచుతున్న మేకర్స్
ఈ వార్తాకథనం ఏంటి
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబి కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం '#Mega158'పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వరుస అప్‌డేట్లు అభిమానుల్లో ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. తాజాగా చిత్రబృందం ఈ సినిమాను మే 21న పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా మరో కీలక అప్‌డేట్‌ను కూడా మేకర్స్ వెల్లడించారు. 'జైలర్', 'డాకు మహారాజ్' వంటి విజయవంతమైన చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన విజయ్ కార్తిక్ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా పనిచేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
వివరాలు
విజయ్ కార్తీక్ కన్నన్ పుట్టిన రోజు సందర్భంగా ప్రకటన
విజయ్ కార్తీక్ కన్నన్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటన చేయడం విశేషంగా మారింది. ఇదిలా ఉంటే, ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా సిద్ధమవుతున్నారు. ఇటీవల ఆయన జిమ్‌లో కఠినమైన వర్కౌట్స్ చేస్తూ కనిపించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోకు ఆయన పెట్టిన క్యాప్షన్ కూడా అభిమానులను ఆకట్టుకుంది. "ప్రతి రోజూ మన పరిమితులను అధిగమించడానికి ఒక కొత్త అవకాశం. #Mega158కోసం నా ప్రియమైన బాబీతో మరో గుర్తుండిపోయే ప్రయాణానికి ఎంతో ఉత్సాహంగా, సిద్ధంగా ఉన్నాను. మే 21న ప్రారంభోత్సవం అంటూ చిరంజీవి వెల్లడించారు. ఈ పాత్ర కోసం చిరంజీవి ప్రత్యేక శిక్షణ తీసుకుంటూ తన ఫిజిక్‌ను మార్చుకుంటున్న తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాలు
అభిమానుల్లో భారీ అంచనాలు
అభిమానులు కూడా మెగాస్టార్ డెడికేషన్‌ను ప్రశంసిస్తున్నారు. గతంలో చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పట్లో విడుదల చేసిన పోస్టర్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. గోడను చీల్చుకుంటూ బయటకు వస్తున్న గొడ్డలి, దానిపై కనిపించిన రక్తపు మరకలు, అలాగే "ది బ్లేడ్ దట్ సెట్ ది బ్లడీ బెంచ్‌మార్క్" అనే ట్యాగ్‌లైన్ సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచాయి. ఈ చిత్రాన్ని వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించిన చిరంజీవి - బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో '#Mega158'పై ట్రేడ్ వర్గాలు, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.