Page Loader
Avatar 3: అవతార్‌ 3.. ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుంది: జేమ్స్‌ కామెరూన్‌
అవతార్‌ 3.. ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుంది: జేమ్స్‌ కామెరూన్‌

Avatar 3: అవతార్‌ 3.. ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుంది: జేమ్స్‌ కామెరూన్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 21, 2025
01:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదరణను పొంది, కోట్లాది రూపాయలను వసూలు చేసిన విజువల్‌ వండర్‌ 'అవతార్‌' గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. హాలీవుడ్ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ రూపొందించిన ఈ ఫ్రాంచైజీ ఇప్పటికే రెండు భాగాలు సంచలనం సృష్టించాయి. ఇప్పుడు, ఆ ప్రయాణం మరింత గ్రాండ్‌గా కొనసాగుతోంది. ఫ్రాంచైజీలో మూడో భాగం 'అవతార్‌ - ఫైర్‌ అండ్‌ యాష్‌' పేరిట రూపొందుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో జేమ్స్‌ కామెరూన్‌ మాట్లాడుతూ, ఈ చిత్రానికి సంబంధించిన కీలక అంశాలను పంచుకున్నారు.

వివరాలు 

కొత్త ప్రపంచం, విభిన్నమైన కథనం 

"గత రెండు చిత్రాల కంటే ఈ చిత్రం నిడివి ఎక్కువగా ఉంటుంది. ప్రేక్షకుల అంచనాలకు మించి ఉండేలా దీన్ని తీర్చిదిద్దుతున్నాం. తెరపై ఈ విజువల్‌ వండర్‌ను చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యచకితులు అవుతారు. రెండు భాగాల్లో చూపిన అంశాలను ఎక్కడా పునరావృతం చేయకుండా కొత్త ధైర్యమైన ఎంపికలతో ముందుకు వస్తున్నాం. దీని ద్వారా ప్రతి ఒక్కరి సమయాన్ని, డబ్బును న్యాయంగా వినియోగించుకుంటున్నట్లు భావిస్తున్నాను" అని తెలిపారు. ఈసారి కథనంలో పూర్తిగా కొత్తదనాన్ని అందిస్తామనీ,పాత్రలపై ప్రత్యేక దృష్టి పెట్టామని కామెరూన్‌ చెప్పారు."ఈ భాగంలో మీరు లైవ్‌-యాక్షన్‌ అదనపు అద్భుతాలను చూస్తారు. పండోర అనే కొత్త ప్రపంచం, వినూత్నమైన పాత్రలతో విభిన్నమైన అనుభూతిని ఇస్తాం. ఈ సినిమా ప్రేక్షకులను మరో స్థాయిలో కట్టిపడేస్తుంది," అని చెప్పారు.

వివరాలు 

'అవతార్‌' - ఓ విజువల్‌ సంచలనం 

జేమ్స్‌ కామెరూన్‌ సృష్టించిన 'అవతార్‌' ప్రపంచ సినిమా పరిశ్రమలో ఓ మైలురాయిగా నిలిచింది. పండోర అనే ఊహాజనిత గ్రహాన్ని,అందులోని ప్రకృతి సౌందర్యాలను అద్భుత విజువల్‌ ఎఫెక్ట్స్‌తో చూపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. 2022లో వచ్చిన 'అవతార్‌:ది వే ఆఫ్‌ వాటర్‌'తో మరోసారి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. మూడో భాగం-అగ్ని ప్రధాన కాన్సెప్ట్ ఈసారి అగ్ని ప్రధానమైన అంశంగా మూడో భాగాన్ని రూపొందిస్తున్నారు.2025 డిసెంబరు 19న ఈ సినిమా విడుదల కానుంది. అలాగే,'అవతార్‌ 4' 2029లో,'అవతార్‌ 5' 2031 డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం స్పష్టం చేసింది. ఈ తాజా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొత్త ప్రపంచం, విభిన్నమైన కథనం, అలరించే విజువల్‌ ఎఫెక్ట్స్‌తో 'అవతార్‌' మూడో భాగం మరో సంచలనం సృష్టించనుంది.