
Homebound: టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించేందుకు జాన్వీకపూర్ చిత్రం ఎంపిక
ఈ వార్తాకథనం ఏంటి
'ధడక్' చిత్రంలో ప్రేమికులుగా నటించి హిట్ అందుకున్న బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ,ఇషాన్ ఖట్టర్ మరోసారి కలిసి నటించిన చిత్రం'హోమ్‌బౌండ్'. నీరజ్ ఘైవాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రశంసలు పొందిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా మరో గొప్ప గౌరవాన్ని అందుకుంది. 2025 టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించేందుకు ఎంపికైంది. గాలా ప్రెజెంటేషనల్ విభాగంలో ఈ చిత్రాన్ని అధికారికంగా ఎంపిక చేసినట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ సందర్భంగా తమ చిత్రం టీఐఎఫ్ఎఫ్‌కు ఎంపిక కావడం గర్వకారణంగా భావిస్తున్నామని చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది. ఈ సందర్భంగా జాన్వీ కపూర్ సినిమా పోస్టర్‌ను తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
వివరాలు
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ 'హోమ్‌బౌండ్' చిత్రం ప్రదర్శన
ఇటీవలే ఈ చిత్రం ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (IFFM) నామినేషన్లలో కూడా స్థానం దక్కించుకుంది. అంతేకాక,2025 మే నెలలో జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ 'హోమ్‌బౌండ్' చిత్రాన్ని ప్రదర్శించారు. ఆ వేదికపై సినిమా ప్రదర్శించబడిన వెంటనే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. సినిమా ముగిసిన తర్వాత ప్రేక్షకులు నిల్చొని మొత్తం 9 నిమిషాల పాటు చప్పట్లు కొడుతూ చిత్ర బృందాన్ని అభినందించారు.
వివరాలు
పోలీస్ ఉద్యోగాన్ని సాధించాలని కలలు కన్నా కథాంశంతో సినిమా
ఈ చిత్రాన్ని తెరకెక్కించిన నీరజ్ ఘైవాన్ దర్శకత్వంలో జాన్వీ కపూర్,ఇషాన్ ఖట్టర్ ప్రధాన పాత్రల్లో నటించగా,విశాల్ జెత్వా మరో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. బాల్య స్నేహితులుగా ఉన్న ఇద్దరు యువకులు పోలీస్ ఉద్యోగాన్ని సాధించాలని కలలు కన్నా కథాంశంతో ఈ సినిమా రూపొందింది. లక్ష్యానికి దగ్గర పడే కొద్దీ వారి మధ్య పెరిగిన దూరం ఏ కారణాలతో ఏర్పడిందనేదే ప్రధాన అంశంగా ఈ కథ కొనసాగుతుంది. ఈ చిత్ర విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.