బీజేపీ నాయకుడు జితేందర్ రెడ్డి బయోపిక్: టైటిల్ రోల్ లో రాకేష్ వర్రె
జగిత్యాల కు చెందిన బీజేపీ తొలి తరం నాయకుడు జితేందర్ రెడ్డి జీవితం బయోపిక్ గా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ ప్రకటన వచ్చినప్పటినుండి ఇందులో టైటిల్ రోల్ లో ఎవరు కనిపిస్తున్నారనే విషయమై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. తాజాగా వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ జితేందర్ రెడ్డి బయోపిక్ నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చింది. ఫస్ట్ లుక్ లో కనిపించిన దాని ప్రకారం, జితేందర్ రెడ్డి టైటిల్ పాత్రలో బాహుబలి నటుడు రాకేష్ వర్రె కనిపించబోతున్నారు. బాహుబలి సినిమాలో దేవసేనను ఇబ్బంది పెట్టే పాత్రలో కనిపించిన నటుడే ఈ రాకేష్ వర్రె. బాహుబలి తర్వాత ఎవ్వరికీ చెప్పొద్దు అనే సినిమాతో రాకేష్ వర్రె హీరోగా మారాడు.
విరించి వర్మ దర్శకత్వంలో జితేందర్ రెడ్డి సినిమా
చిన్న సినిమాగా రిలీజైన ఎవ్వరికీ చెప్పొద్దు చిత్రం తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఆ తర్వాత మరే సినిమాలోనూ రాకేష్ వర్రె కనిపించలేదు. ప్రస్తుతం జితేందర్ రెడ్డి సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ఈ సినిమాకు ఉయ్యాల జంపాలతో దర్శకుడిగా మారిన విరించి వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఉయ్యాల జంపాల తర్వాత నాని హీరోగా మజ్ను సినిమాను తెరకెక్కించాడు విరించి వర్మ. ఆ సినిమా మంచి సక్సెస్ సాధించినప్పటికీ నెక్స్ట్ సినిమాను విరించి వర్మ ప్రకటించలేదు. ఏడేళ్ల తర్వాత ఇప్పుడు జితేందర్ రెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గోపి సుందర్ సంగీతమందిస్తున్న జితేందర్ రెడ్డి సినిమాకు జ్ఞాన శేఖర్ వి ఎస్ కెమెరా బాధ్యలను నిర్వర్తిస్తున్నారు.